మీడియా ఎలా వుండాలి.? అని ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. కానీ, మీడియా అంటే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన విభాగాల్లో ఒకటి. అత్యంత బాధ్యతాయుతమైన వ్యవస్థ అది. ‘ఫోర్త్ ఎస్టేట్’ అని చెబుతుంటాం.
టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో బెయిల్ వస్తే, టీడీపీ అను‘కుల’ మీడియా పండగ చేసుకుంది. పండగ చేసుకోవడాన్ని ఎలా తప్పు పట్టగలం.? ఆ మీడియాకి తెరవెనుకాల ఆర్థిక అండదండలందించేది టీడీపీనే. పైగా, ‘కుల’ జాడ్యం ఒకటి.!
కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో టీవీలు పగిలాయంటూ ‘అతి’ చేయడం ఎంతవరకు సబబు.? ‘చాలా టీవీలు తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇంట్లో పగిలాయట. మాకు ఖచ్చితమైన సమాచారం వుంది..’ అంటూ టీడీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న ప్రచారం వైసీపీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
వైసీపీ అనుకూల మీడియా ఈ విషయంలో తక్కువేం తిన్లేదు. ‘చంద్రబాబుకి వచ్చింది కండిషన్ బెయిల్ మాత్రమే..’ అంటూ తనకు తోచిన కథనాలు రాస్తూ, యెల్లో మీడియా మీదా విరుచుకుపడుతోంది.
రాజకీయ పార్టీల మధ్య పోరు ఎలా వున్నా, మీడియా సంస్థల మధ్య కనిపిస్తున్న ఈ పోరు పట్ల మాత్రం, పాత్రికేయ రంగంలో బోల్డంత చర్చ జరుగుతోంది. న్యూట్రల్ జర్నలిస్టులు, మీడియా ప్రస్తుత పోకడల్ని తప్పు పడుతున్నారు. చంద్రబాబు విషయంలో బ్లూ మీడియా చేస్తున్నదీ తప్పే, వైఎస్ జగన్ విషయంలో యెల్లో మీడియా చేస్తున్నదీ తప్పేనన్నది వారి వాదన.
వాస్తవానికి, వైసీపీ అధికారంలో వుంది గనుక, తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయ్.. అన్న యెల్లో మీడియా వార్తలపై చట్టపరమైన చర్యలకు దిగాల్సి వుంది. దిగుతుందా మరి.?