పసుపు పండగ.! ఎన్టీయార్ ఆత్మ క్షోభ.!

తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ అంగరవంగ వైభవంగా జరుగుతోంది. అంతటా పసుపు మయం.! దీన్ని పసుపు పండగ.. అని టీడీపీ చెప్పుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందర జరుగుతున్న మహానాడు ఇది. కీలక తీర్మానాలు, పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు.. అబ్బో, కథ పెద్దదే వుంది.

కానీ, నాణేనికి ఇంకో వైపు కూడా వుందండోయ్.! ఎటు చూసినా స్వర్గీయ ఎన్టీయార్ ఫొటోలతో కూడిన కటౌట్లు.. ప్రాంగణంలో ఆ ఎన్టీయార్ విగ్రహం.. చెప్పుకుంటూ పోతే ఇది మరో కథ. ఇంతకీ, స్వర్గీయ ఎన్టీయార్ ఆత్మ ఏమని ఘోషిస్తుంటుంది.?

అసలు తెలుగుదేశం పార్టీకీ, స్వర్గీయ ఎన్టీయార్‌కీ సంబంధమేంటి.? స్వర్గీయ ఎన్టీయార్‌ని టీడీపీ నుంచి బహిష్కరించేశారు కదా, ఆయన్ని మళ్ళీ టీడీపీలో ఎప్పుడు చేర్చుకున్నారు.? చనిపోయారు గనుక, స్వర్గీయ ఎన్టీయార్ తిరిగి టీడీపీలో చేరే అవకాశం లేదు. ఆయన మళ్ళీ బతికొచ్చి, నన్ను వెన్ను పోటు పొడిచారు.. చంద్రబాబుతో నాకు సంబంధం లేదు.. అని చెప్పలేరు.

బతికున్నప్పుడు ఆయన ఆ మాట చెప్పినా, ఎవరూ వినలేదాయె. అప్పట్లో, స్వర్గీయ ఎన్టీయార్ గుడ్డలూడదీసింది ఓ వర్గం మీడియా.. కార్టూన్ల రూపంలో. ఇప్పుడు అదే మీడియా, స్వర్గీయ ఎన్టీయార్ ఘనతలు చూపిస్తోంది.

వేదిక వెనకాల ఫొటోల్లో ఎన్టీయార్.. ఆ వేదికపై, రాజకీయంగా ఎన్టీయార్‌ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. ఇది కదా, అసలు సిసలు పసుపు పండగ అంటే.! చిత్రమేంటంటే, ఈసారి ‘మహానాడు’ పేరుతో ఆ ఎన్టీయార్ మనవడు జూనియర్ ఎన్టీయార్ మీద పసుపు దళం, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో విరుచుకు పడుతుండడం.