కొన్ని విషయాల్లో నేను మీ మాట వింటే… మరికొన్ని విషయాల్లో మీరు నా మాట శిరసా వహించాలనే కండిషన్ చంద్రబాబు – పవన్ ల మధ్య ఉందో ఏమో తెలియదు కానీ… సీట్ల సర్దుబాటులో భాగంగా పార్టీ కంచుకోటల విషయంలో చంద్రబాబు అశ్రద్ధ వహిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్కసారి కంచుకోటలను చేజేతులా వదులుకుంటే… రేపు మనకు కాకుండా పోతుందనే విషయం చంద్రబాబు మరిచిపొతున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే పలు కీలక నియోజకవర్గాలను, టీడీపీ కంచుకోటలను చంద్రబాబు వదులుకుంటున్నారనే విమర్శ తమ్ముళ్ల నుంచి ఉంది. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటుతో పాటు, రాజోలు ను కూడా ప్రస్థావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య రాజోలులో జనసేన గెలిచింది తప్ప… అదేమీ వారికి కంచుకోట కాదనేది వారి తమ్ముళ్ల అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో పలు కీలక నియోజకవర్గాలను చంద్రబాబు వదులుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఎలమంచిలి టిక్కెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వడానికి బాబు సుముఖంగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఈ విషయంపై టీడీపీ నేతలు కారాలూ మిరియాలూ నూరుతున్నారని అంటున్నారు. కారణం… ఎలమంచిలి నియోజకవర్గంలో ఇప్పటిదాకా తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ ఆరుసార్లు గెలిచింది. అంటే… ఇది ఆ పార్టీకి ఎంత కంచు కోట అనేది అర్ధం చేసుకోవాలనేది తమ్ముళ్ల ఆవేదన!
అయితే గత ఎన్నికల్లో ఫ్యాన్ గిరా గిరా తిరగడంతో అక్కడ వైసీపీ తొలిసారి జెండా ఎగరేసింది. అక్కడికీ టీడీపీ చివరివరకూ బలంగా పోరాడింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 71,934 ఓట్లు రాగా.. టీడీపీకి 67,788 ఓట్లు వచ్చాయి. అంటే తేడా… కేవలం 4,146 ఓట్లు మాత్రమే!! ఇక్కడ జనసేనకు 19,774 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే… టీడీపీ వచ్చిన ఓట్లలో సుమారు మూడోవంతు అన్నమాట! అలాంటి సీటును జనసేన అడుగుతుంది.
వాళ్లు అడగడంలో ఇబ్బంది లేదు కానీ… అందుకు బాబు “ఓకే” అనేలా ఉన్నారనే విషయంపైనే తమ్ముళ్ల ఆవేదన అంతా. పైగా… సీనియర్ నేతగా ఉన్న పప్పల చలపతిరావు వంటి వారు నాలుగు సార్లు వరసగా గెలిచి ఎలమంచిలిలో టీడీపీ జెండా ఎగరేశారు. ఇదే సమయంలో విశాఖ జెడ్పీ మాజీ చైర్మన్ లాలం భవానీతో పాటు మరికొంతమంది టీడీపీ సీనియర్ నేతలు ఎలమంచిలి టికెట్ ని ఆశిస్తున్నారు.
దీంతో… టీడీపీకి ఇంత బలమైన సీటుని జనసేనకు ఇస్తే.. టీడీపీ పట్టు జారిపోతుందని అక్కడున్న తమ్ముళ్లు అంటున్నారు. అయితే… చంద్రబాబు మాత్రం జనసేనకే ఆ సీటు అంటోన్నారని తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కు సుందరపు విజయ్ కుమార్ సన్నిహితుడు కావడంతో ఆయనకు ఈ సీటుని కేటాయిస్తున్నారు అని తెలుస్తోంది. దీంతో… ఒకసారి సీటు చేజారితే మళ్లీ టీడీపీ ఇక్కడ జెండా పాతడం కష్టం అని తలపండిన తమ్ముళ్ళు చెబుతున్నారు.
ఇదే సమయంలో… టీడీపీ కంచుకోటలపైనే జనసేన గురి పెడుతుందన్న విషయాన్ని బాబు గ్రహించలేకపోతున్నారని.. ఈ విషయాన్ని గ్రహించని పక్షంలో ప్రత్యమ్నాయ శక్తిగా జనసేన ఎదిగే అవకాశం లేకపోలేదని.. బాబు చేజేతులా సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని వారు అంటున్నారు.