జగనన్నా.! మేం మిమ్మల్ని నమ్మలేం.!

‘మాకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వుండటంలేదు..’ ఈ మాట వైసీపీలో కొందరు ముఖ్య నేతలు కూడా ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు. అలాంటి పరిస్థితులు వున్నాయి. ఏ విషయమూ వైఎస్ జగన్ వద్దకు చేరడంలేదు. అలాగని ఓ వర్గం, ఓ కోటరీ.. వైఎస్ జగన్‌ని కట్టడి చేస్తోందా.? అంటే, ఎవరో కట్టడి చేస్తే, కట్టడి అయిపోయే వ్యక్తి కూడా కాదు.

అటు ప్రభుత్వం, ఇటు పార్టీ.. రెండిటినీ బ్యాలెన్స్ చేయడమంటే అడ కత్తెరలో పోక చెక్కలా వుంటుంది వ్యవహారం.! ఈ విషయంలో వైఎస్ జగన్ కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నమాట వాస్తవం. కానీ, ఆయన ఎవరి మాటా వినరు.

విజయసాయిరెడ్డి లాంటి కరడుగట్టిన వైసీపీ నేత ఇటీవలి కాలంలో సైలెంట్ అయిపోయారంటే, దానిక్కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలో సజ్జల ప్రాబల్యం పెరుగుతోంది. సోషల్ మీడియా బాధ్యతలేమో సజ్జల కుమారుడి చేతిలో వున్నాయ్.

సోషల్ మీడియాలో రోత రాతల నేపథ్యంలో అడపా దడపా వైసీపీ మద్దతుదారులపైనా కేసులు నమోదవుతున్నాయి. ఆయా కేసుల్లో వైసీపీ మద్దతుదారులకు పార్టీ నాయకత్వం నుంచి తగిన సాయం అందడంలేదు.. అది ఆర్థికంగా అయినా, న్యాయ సాయం పరంగా అయినా.

‘ఇకపై అంతా మారుతుంది.. మీకు నేనున్నాను..’ అని సజ్జల కుమారుడు, బెంగళూరులో జరిగిన వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ఆత్మీయ సమావేశంలో చెప్పుకొచ్చాడట. ‘మీ మీద నమ్మకం లేదు దొరా.. వైఎస్ జగన్ మీద కూడా నమ్మకం కోల్పోతున్నాం..’ అని ఆ ఆత్మీయ సమావేశం సాక్షిగానే కొందరు వైసీపీ వాదులు తేల్చి చెప్పేశారు.