వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తానింకా వైసీపీలోనే వున్నానని చెబుతుంటారు. నిజమే, ఆయన్ని వైసీపీ ఇంతవరకు సస్పెండ్ చేయడం జరగలేదు. సస్పెండ్ చెయ్యలేని దుస్థితి వైసీపీది. ఆయన మీద అనర్హత వేటు వేయించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
అధికారం చేతిలో వుంది గనుక, అరెస్టు చేయించారు.. ‘థర్డ్ డిగ్రీ’ ఏదో ఆయన మీద ప్రయోగించారట కూడా. అలాగని రఘురామ ఆరోపించారనుకోండి.. అది వేరే సంగతి. అప్పటినుంచి రఘురామ వ్యవహార శైలిలో మరింతగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.
వైసీపీని రఘురామ వీడరు.. వైసీపీని విమర్శించడం మానరు. ‘మా పార్టీ.. మా పార్టీ..’ అంటూ ర్యాగింగ్ మాత్రం చేస్తూనే వుంటారు. అసలు విషయానికొస్తే, రఘురామ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
ప్రస్తుతానికి మూడు పార్టీల్లో ఆయన కర్చీఫ్ వేశారు. ఒకటి బీజేపీ, ఇంకోటి టీడీపీ.. మరొకటి జనసేన. టీడీపీ – బీజేపీ – జనసేన కలుస్తాయన్నది రఘురామకృష్ణరాజు నమ్మకం. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయం.? అన్న దిశగా రఘురామ లెక్కలేసుకుంటున్నారు. ఢిల్లీకి వచ్చిన జనసేనానితో రఘురామ భేటీ సందర్భంగా, పార్టీలో చేరే విషయమ్మీద కూడా రఘురామ చర్చించారట.
నర్సాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుని ఓడించింది ఇదే రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి గెలిచిన నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వుంది.!