వైసీపీ ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి పార్టీ మారబోతున్నారా.? ఈ క్రమంలోనే ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారా.? ‘నేనేమీ టీడీపీ అభ్యర్థికి ఓటెయ్య లేదు.. నా ఓటు వైసీపీకే పడింది..’ అని శ్రీదేవి చెబుతున్నా, వైసీపీ మాత్రం ఆమె మాటల్ని విశ్వసించడంలేదు.
వైసీపీ సోషల్ మీడియా విభాగం, వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్న దరిమిలా, ఎమ్మెల్యే శ్రీదేవికి టీడీపీ నుంచి మద్దతు లభిస్తోంది. టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి అండగా వుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా చేస్తోన్న బూతుల ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు.
ఇదో చిత్రమైన సందర్భం. గతంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ చాలా చాలా ఆరోపణలు చేసింది. ఇసుక కుంభకోణం, పేకాట క్లబ్బులు.. ఇలా శ్రీదేవి మీద టీడీపీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఓ పోలీస్ అధికారిని ఆమె బెదిరించడం, దూషించడం కూడా అప్పట్లో వివాదాస్పదమయ్యింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఎమ్మెల్యే శ్రీదేవికి టీడీపీలో పూర్తి మద్దతు లభిస్తోంది. ఆమెను టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు సుముఖంగా వున్నారనే ప్రచారం జరుగుతోంది.
కాదు కాదు, ఆల్రెడీ ఆమెతో చంద్రబాబు మంతనాలు షురూ చేశారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తరహాలోనే శ్రీదేవి కూడా టీడీపీ మద్దతుదారుగా మారిపోయే అవకాశం వుంది.