సంచలనం : వైసిపి ఎంఎల్ఏకి రూ 30 కోట్లు

తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయిస్తే తనకు రూ 30 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చినట్లు విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల వైసిపి ఎంఎల్ఏ బూడి ముత్యాలనాయుడు బాంబు పెల్చారు. అనకాపల్లిలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, తనను సైకిల్ పార్టీలోకి లాక్కునేందుకు టిడిపి నేతలు అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేసినట్లు చెప్పటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను లొంగకపోయేసరికి చివరకు రూ 30 కోట్లకు ఆఫర్ వచ్చినట్లు చెప్పారు.

నిజానికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే చంద్రబాబునాయుడు పిరాయింపులకు తెరలేపారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరికీ ఒక్కో ధర, ఒక్కో ప్రలోభంతో వలేశారు. వందల కోట్ల రూపాయలతో ఎర వేసి 22 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను లాక్కున్నారు. చంద్రబాబు ప్రోత్సహిస్తున్న  ఫిరాయింపులపై రాష్ట్రంలో వైసిపి ఎంత గోలచేసినా,  జాతీయ స్ధాయిలో ఎంత చర్చ  జరిగినా పట్టించుకోలేదు. అయితే నాలుగేళ్ళ తర్వాత ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేశారు. వచ్చే ఎన్నికలకు అసెంబ్లీ సీట్లు పెరగవన్న విషయం అర్ధమైపోయింది చంద్రబాబుకు. 2019లో టిక్కెట్లిస్తానన్న హామీతోనే 22 మందిని ఫిరాయింపులకు ప్రోత్సహించారన్న విషయం అందరకీ తెలిసిందే.

ఎప్పుడైతే అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగవని ఖాయమైపోయిందో ఫిరాయింపులు కాస్త నెమ్మదించాయి. అయితే, హఠాత్తుగా మాడుగుల ఎంఎల్ఏ ముత్యాలు చేసిన ప్రకటనతో మళ్ళీ ఫిరాయింపులపై చర్చ మొదలైంది. షెడ్యూల్ ఎన్నికలు మరో 7 మాసాల్లో ఉండగా ఇఫుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తే చంద్రబాబుకు వచ్చే లాభమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అదే సమయంలో అరకు ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన తర్వాత ఫిరాయింపుల్లోను, ఫిరాయించాలని అనుకున్న వాళ్ళల్లోను ఆందోళన మొదలైందన్నది వాస్తవం. మరి ఇటువంటి పరిస్దితుల్లో ముత్యాలు చేసిన ప్రకటన ఎప్పటి విషయమో అర్ధం కావటం లేదు.