వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజీనామా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ధిక్కార ధోరణి ప్రదర్శించే నేతల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తప్ప ఎవరూ ధిక్కార స్వరం వినిపించలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నిరసన గళం వినిపించడం మొదలు పెట్టారు. ఆయన్ని పార్టీ దాదాపుగా ‘డిస్ ఓన్’ చేసుకున్నట్లే భావించాలి.

తాజాగా, నెల్లూరు జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఏకంగా తన ఫోన్‌ని ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాస్ లీడర్. కానీ, ఆయన పేరు చెబితే చాలా వివాదాలు తెరపైకొస్తాయి. ఓ సీనియర్ జర్నలిస్టు ఇంటి మీదకు దాడికి వెళ్ళిన ఘటనలో ఆయనపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన్ని అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాలు మండిపడగా, ముందస్తుగా ఆయనే వెళ్ళి పోలీసులకు లొంగిపోయారు.

గత కొద్ది రోజులుగా వైసీపీ అధినాయకత్వం తీరు పట్ల అసహనంతో వున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ ఆలోచనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆయనకు కొత్త కాదు. అమరావతి రైతుల తిరుపతి పాదయాత్ర సందర్భంగా, వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా అధినాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

ఆయనిప్పుడు రాజీనామా చేయబోతున్నారట. విషయం ముదిరి పాకాన పడ్డంతో, నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జిని మార్చే యోచనలో వుంది వైసీపీ అధిష్టానం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైత్యానికి విరుగుడుగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని వైసీపీ అధినాయకత్వం రంగంలోకి దించిందట.