ఆయన ఒకప్పుడు పవన్ కకళ్యాణ్‌కి వీరాభిమాని. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
వైఎస్ జగన్‌తో అత్యంత సాన్నిహిత్యంతోపాటు, సామాజిక వర్గ సమీకరణాలు.. ఇవన్నీ కలిసొచ్చి, ఆయనకు మంత్రి పదవి దక్కింది తొలి దఫాలోనే. అయితే, ఆ పదవిలో కొనసాగింపు మాత్రం పొందలేకపోయారు అనిల్ కుమార్ యాదవ్.
గత కొంతకాలంగా అనిల్ కుమార్ యాదవ్ ఒకింత సైలెంటుగా వుంటూ వస్తున్నారు. జిల్లాలో వైసీపీ నేతలకు ఒకరితో ఒకరికి అస్సలు పొసగడంలేదు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో విభేదాలు సహా.. చాలా వ్యవహారాలున్నాయ్.
అనిల్ కుమార్ యాదవ్ టీడీపీలోకి వెళతారనీ, జనసేన వైపు చూస్తున్నారనీ, బీజేపీలోకి వెళ్ళే అవకాశం వుందనీ.. ఇలా బోల్డన్ని గుసగుసలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. అయితే, నెల్లూరు వైసీపీలో తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల సంగతెలా వున్నా, అనిల్ మాత్రం వైసీపీని వీడరని ఆయన అనుచరులు చెబుతూనే వున్నారు.
తాజాగా ఈ విషయమై అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు, ‘అరేయ్ పప్పూ..’ అంటూ నారా లోకేష్ మీద విరుచుకుపడిపోయారు. ‘ఏది ఏమైనా వైసీపీలోనే వుంటా.. టిక్కెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా జగన్ వెంటే వుంటా..’ అంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడంతో, ఆయన అనుచరులకీ ఓ క్లారిటీ వచ్చేసింది.
అయినాగానీ, ఎక్కడో వ్యవహారం తేడా కొడుతోంది. నారా లోకేష్ నెల్లూరులో ‘యువగళం పాదయాత్ర’ నిర్వహించడం.. ఆ హంగామా.. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ నుంచి పొలిటికల్ సెటైర్స్ ఇప్పటిదాకా ఎందుకు పేలలేదో మరి.! అనిల్ స్పష్టతనిచ్చినా.. డౌట్లు వస్తున్నాయంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే.