వైసీపీ మీడియానే వైసీపీకి వెన్నుపోటు పొడుస్తోందా.?

రాజకీయాలన్నాక వెన్నుపోట్లు సహజం. రాజకీయ పార్టీల్లో అంతర్గత వెన్నుపోట్ల సంగతి వేరు. ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేసే మీడియా సంస్థల వెన్నుపోటు వేరు.! 2019 ఎన్నికల్లో టీడీపీని రాజకీయంగా వెన్నుపోటు పొడిచింది టీడీపీ అనుకూల మీడియానే.! ఇప్పుడు వైసీపీకి కూడా అదే సమస్య ఎదురు కాబోతోందా.? అంటే, ఔననే చెప్పాలేమో.! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి, ఆయన ఏకంగా మతం మారాడంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై వైసీపీ అనుకూల మీడియా ఇచ్చిన స్పెషల్ కవరేజ్ అంతా ఇంతా కాదు.

ఆ దెబ్బకి వైసీపీ మీద ఈ కేసుకు సంబంధించి అంతకు ముందు వరకు వున్న సింపతీ అంతా సర్వనాశనమైపోయింది. అక్రమ సంబంధం, మత మార్పిడి.. ఇవన్నీ వైసీపీ స్థాయిని దిగజార్చేశాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ పరిస్థితిని మరింత దారుణంగా మార్చేశాయి. ఇవి చాలక, వైసీపీని వీడనున్న ముఖ్య నేతలు.. అంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంతో, ఆయా నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొందరేమో వివరణ ఇచ్చుకుంటోంటే, అధినాయకత్వమే అనుకూల మీడియాని ప్రోత్సహిస్తూ, తమ స్థాయిని దిగజార్చుతోందని ఇంకొందరు వాపోతున్నారు. ముగ్గురు ఎంపీలు ఇదే బాటలో వైసీపీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ‘అప్పుడు టీడీపీ అనుకూల మీడియా చేసిందే, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా చేస్తోంది’ అని ఆయా నేతలు ఆఫ్ ది రికార్డుగా మీడియాతో చెబుతున్నారట.