ఏపీ ప్రతి పక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎయిర్పోర్టులో కోడి కత్తితో దాడి జరిగింది. అయితే ఏపీ ముఖ్య ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందంటూ ఆపరేషన్ గరుడ పేరిట గతంలోనే వెల్లడించారు నటుడు శివాజీ. అయితే ఈ ఘటన గురించి ముందే తెలిపిన శివాజీపై రాజద్రోహంకేసు నమోదు చేయాలనీ వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకులు కోరారు.
ఈమేరకు మంగళవారం అనంతపురం డిఎస్పీ వెంకట్రావును ఆయన ఛాంబర్ లో వైసీపీ లీగల్ సెల్ నాయకులు కలిశారు. వీరిలో గోవిందరాజులు, దాదాఖలందర్, ఈశ్వరప్ప తదితర నాయకులు ఉన్నారు. వీరంతా శివాజీపై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ అనంతపురం డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియా ఎదుట వివరాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సినీ నటుడు శివాజీ “ఆపరేషన్ గరుడ” పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని మీడియా ద్వారా ప్రచారం సాగించారు. ఆ తర్వాత కొద్దీ రోజులకే విశాఖ విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగింది. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలుసు అని అడిగారు?
ఈ హత్యాయత్నం కేసులో శివాజీతోపాటు మరి కొందరు పెద్ద స్థాయి నాయకుల పాత్ర ఉందనే అనుమానం వ్యక్తంచేశారు. శివాజీపై రాజద్రోహం కేసు నమోదు చేయాలనీ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే శివాజీ మాత్రం తాను చట్టపరమైన హక్కులు ఉపయోగించుకుని తనకు తెలిసిన వివరాలు వెల్లడించానని చెబుతున్నారు. నాపైన ఎటువంటి కేసులు పెట్టలేరని, పెట్టినా చెల్లవని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కానీ వైసీపీ నేతలు మాత్రం జగన్ పై దాడి జరిగినప్పటి నుండి శివాజీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ గరుడ ఒక డ్రామా అంటున్నారు. అధికార ప్రభుత్వం కుట్ర పన్ని జగన్ పై దాడి చేయించిందని, శివాజీని ఉపయోగించుకుని ఆపరేషన్ గరుడ అని డ్రామాలు ఆడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.