జగన్ సంచలన నిర్ణయం: పరుగులు పెడుతున్న పార్టీ నేతలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. సీనియర్ నేతలు పార్టీలు మారడం, కొత్త పార్టీలు రావడంతోపాటు పొత్తుల దిశగా పార్టీల అధిపతులు అడుగులు వేయడం సహజమే… ఈ నేపథ్యంలో ఎన్నికల సమీకరణలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

రాజకీయ పార్టీల అధిపతులు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించే పనిలో పడ్డారు. ఇక వైసిపి అధినేత జగన్ ఈ విషయంలో చాలా నిర్మొహమాట ధోరణి కనబరుస్తున్నట్టు స్పష్టమవుతోంది. వంగవీటి రాధా విషయంలో ఇప్పటికే ఇది వాస్తవమని తేలిపోయింది. పార్టీ గెలుపే ధ్యేయంగా అభ్యర్థులను, నియోజకవర్గ ఇంచార్జిలను మార్చడానికి వెనుకాడట్లేదు జగన్.

గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఈ ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్త పడుతున్నారు జగన్. అభ్యర్థుల ఎన్నికకై సర్వేలు నిర్వహించి విజయావకాశాలు బేరీజు వేసుకుని బలహీనంగా ఉన్న అభ్యర్థులను పక్కన పెడుతున్నారు. ఈ విషయంలో ఆయన దృష్టి మొదట రాజధానిపైనే పెట్టారు. వంగవీటి రాధాకు సెంట్రల్ సీటు కేటాయించకపోవడమే అందుకు నిదర్శనం.

దీంతో వైసిపి నేతల్లో గుబులు మొదలైంది. జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భయపడుతున్నారు. ఇప్పుడు తొందరేముందిలే… ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్దాం అని అలసత్వంగా ఉన్న నాయకులకు షాక్ ఇస్తున్నారు జగన్. నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించగానే ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫర్మ్ అనుకుని ప్రజల్లోకి వెళ్లని నాయకులపై జగన్ వేటు వేస్తున్నారని సమాచారం. దీంతో అప్పటిదాకా కూల్ గా ఉన్న నేతలు ఖంగు తింటున్నారు.

రానున్న ఎన్నికలు వైసిపికి ఎంతో కీలకం. ఎలాగైనా వైసిపి అధికారంలోకి రావాలని ఇటు జగన్, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. దీనికోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా జగన్ ఏమాత్రం తగ్గట్లేదని తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే సీటుపైన స్పష్టమైన నిర్ణయంతో జగన్ ముందుకు వెళుతున్నారని పార్టీ అగ్రనేతల నుండి సమాచారం. అందులో భాగంగానే రాజధానిలో పార్టీ ప్రక్షాళన దిశగా వంగవీటి రాధాను సెంట్రల్ సీటు నుండి తప్పించినట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపు కోసం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. నేతలు అర్ధం చేసుకుని త్యాగాలు చేయడానికి బాధపడకూడదు అని సూచిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. 

తెలుగు రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకి ప్రముఖ స్థానం ఉంది. వంగవీటి రంగ తనయుడిగా రాధాకి కూడా మంచి గుర్తింపు ఉంది. రాధా ఏ పార్టీలో చేరినా వంగవీటి రంగ సృష్టించిన రక్షణ కవచం, కాపు సామజిక వర్గం మద్దతు దృష్టిలో ఉంచుకుని ఆయనకు పెద్ద పీట వేసే అవకాశం ఉంది. అటువంటి రాధాకే వేటు పడిందంటే మా గతి ఏంటో అనుకుని మిగిలిన నేతలు గుబులు పడుతున్నట్టు తెలుస్తోంది.

 అధినేత దృష్టిలో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తమ నియోజక వర్గాల్లో ప్రజల్లోకి వెళ్తూ తమ అధినేతకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ మొదలెట్టేశారని సమాచారం. గడప గడపకి వైసిపి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ తమ అధినేత అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాల పధకం గురించి ప్రజలకు తెలిసేలా వివరిస్తున్నారట.

తమ సీట్లకు ప్రమాదం రాకుండా జాగ్రత్త పడుతున్నారు నేతలు. అధినేత దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడానికి నానా తిప్పలు పడుతున్నారని తెలుస్తోంది. రాధా విషయంలో జగన్ తీసుకున్న కీలక నిర్ణయం పార్టీ నేతల్లో కూడా మార్పు తెచ్చింది. అలసత్వంగా ఉన్న నేతలు సైతం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.