జగన్ నిర్ణయం వైసీపీ నేతలకే నచ్చడం లేదా.. “చెత్త” నిర్ణయం అంటూ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలపై ఏపీ ప్రజల్లో ఎంత మంచి అభిప్రాయం ఉందో జగన్ కొన్ని నిర్ణయాలపై ప్రజల్లో అంతే వ్యతిరేకత ఉంది. ప్రధానంగా చెత్తపన్ను విషయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తి అంతాఇంతా కాదు. చెత్తకు కూడా పన్ను వెయ్యడం ఏంటని చాలామంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ నేతలకు చెత్త పన్ను వల్ల వరుస షాకులు తగులుతున్నాయి.

ప్రజల నుంచి ప్రశ్నలు ఎక్కువ కావడంతో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెత్త పన్నును వసూలు చేయాలని నిబంధనలు ఉండటంతో అధికారులు ఏం చేయలేకపోయారు. గుడివాడ నియోజకవర్గం నుంచి చెత్తపన్ను రూపంలో నెలకు 14 లక్షల రూపాయలు వసూలు అవుతోందని తెలుస్తోంది.

ఎమ్మెల్యే చెప్పినా చెత్త పన్నును వసూలు చేయడం ఆపడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించడంతో చెత్త పన్ను గురించి సీఎం జగన్ తో మాట్లాడాలని కొడాలి నాని భావిస్తున్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని సీఎం జగన్ ను కలిసి చెత్త పన్ను వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పాలని భావిస్తున్నట్టు బోగట్టా. ఎమ్మెల్యేలు చెబితే సీఎం జగన్ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.

చెత్త పన్ను విషయంలో సీఎం జగన్ నిర్ణయం మాత్రం చెత్త నిర్ణయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చెత్త పన్ను విషయంలో వైసీపీ సర్కార్ వెనక్కు తగ్గని పక్షంలో 2024 ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గత ప్రభుత్వాలు అమలు చేయని చెత్త పన్నును వైసీపీ సర్కార్ అమలు చేస్తూ ప్రజలలో వ్యతిరేకతను అంతకంతకూ పెంచుకుంటుందనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.