బీఆర్ఎస్‌తో టచ్‌లోకి వైసీపీ నేత.! వైఎస్ జగన్ గుస్సా.!

తెలంగాణలో తమకున్న ఆస్తులకు సంబంధించి ‘రాజకీయ భద్రత’ నిమిత్తం ఓ వైసీపీ నేత, భారత్ రాష్ట్ర సమితితో టచ్‌లోకి వెళ్ళారట. ఎవరా నేత.? ఏమా కథ.? ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ ఈ అంశం.

ఉత్తరాంధ్రకు చెందిన ఆ వైసీపీ ముఖ్య నేత, గతంలో వైఎస్ జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. రాజశేఖర్ రెడ్డిని తూలనాడారు. విజయమ్మని సైతం నానా మాటలూ అన్నారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ నాయకుడు. కానీ, రోజులు మారాయ్.. కాంగ్రెస్‌లో కీలక పదవులు వదులుకుని, వైసీపీలోకి దూకేశారాయన.

వైసీపీలో సదరు సీనియర్ పొలిటీషియన్‌కి బోల్డంత గౌరవం, పదవులూ దక్కాయ్. కానీ, ఆయన అనూహ్యంగా భారత్ రాష్ట్ర సమితితో టచ్‌లోకి వెళ్ళారట. ఆ పార్టీలో చేరతారా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదుగానీ, ఏపీలో బీఆర్ఎస్‌కి ఆయన పరోక్షంగా తెరవెనుక సహాయ సహకారాలు అందిస్తున్నారట.

‘విడిపోతే తప్పేంటి.?’ అంటూ గతంలో.. అంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సమైక్య, విభజన ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ‘తేలిక వ్యాఖ్యలు’  చేశారు. ఆ క్రమంలో ఆయన మీద సమైక్యవాదులు విరుచుకుపడ్డారు కూడా.

వెనుకాల కుటుంబ సభ్యుల బలం.. సదరు సీనియర్ పొలిటీషియన్‌కి వుంది. ఆ కారణంగానే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, సదరు వైసీపీ నేతతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎలా లీక్ అయ్యిందోగానీ, అధినేత వైఎస్ జగన్ సదరు వైసీపీ నేత మీద గుస్సా అవుతున్నారట.