రాజకీయాల్లో చూస్తే శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అంటారు కానీ కొన్ని కేసులలో మాత్రం అది శుద్ధ తప్పు. ఏపీలో జగన్ చంద్రబాబులను చూసి ఎవరైనా ఈ మాట అనగలరా. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం మీద రెండు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీను కధ కూడా ఇదే. ఆయనకు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ దన్ను ఇప్పుడు దొరికింది. మరింకేంటి అన్నట్లుగా ఆయన తన చిరకాల ప్రత్యర్ధి అచ్చెన్నాయుడుని ఇంటికి పంపుతాను అంటున్నాడు.
టెక్కలి సీటులో అచ్చెన్నాయుడు బాగానే కుదురుకున్నాడు. 2009 ఎన్నికల్లో ఆయన ఓడినా కూడా 2014, 2019 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఇక టెక్కలిలో సంతబొమ్మాళి మండలంలో నూటికి నూరు శాతం అచ్చెన్నాయుడుకు పట్టుంది. దాంతో ఎక్కడ తేడా కొట్టినా అక్కడ వచ్చిన ఓట్లతో అచ్చెన్న విజయుడిగా తిరిగి వస్తున్నాడు. ఆ గుట్టు మట్లన్నీ దగ్గరుండి గమనించిన దువ్వాడ శ్రీను ఈసారి అచ్చెన్న ఆటలు సాగనివ్వను అని గట్టిగానే భజాయిస్తున్నాడు. రిగ్గింగులు చేసి గెలవడం కాదు, ఈసారి ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా చూసుకుంటాను. టెక్కలిలో అచ్చెన్నాయుడు కోటను బద్దలు కొడతాను అని కూడా తాజాగా బీషణ ప్రతిన చేశాడు.
టెక్కలిలో సీన్ చూస్తే నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. అక్కడ బలంగా కాళింగులు ఉన్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన దువ్వాడ శ్రీను అచ్చెన్నాయుడు పెత్తనాన్ని తుదికంటా ఎదిరిస్తూనే వస్తున్నాడు. 2014 నుంచి 2019 వరకూ అచ్చెన్న అధికారంలో ఉంటే ఎదురునిలబడి పోరాడిన ఘనత దువ్వాడ శ్రీనుదే. దాన్ని మెచ్చే జగన్ అతనికి ఈసారి ఫుల్ సపోర్ట్ చేశారు. టెక్కలిలో ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు గలిచినా కూడా అసలైన అధికారం మాత్రం దువ్వాడ శ్రీనుకే అప్పగించేశారు. వైసీపీ ఇంచార్జి హోదాలో దువ్వాడ సమావేశాలు నిర్వహించి అధికారులతో ప్రభుత్వ పనులు చేయిస్తూ తానే ఎమ్మెల్యే అని చాటి చెబుతున్నాడు.
అచ్చెన్నాయుడు కుటుంబం 37 ఏళ్ల రాజకీయ జీవితంలో కొన్ని సార్లు తప్ప ఎక్కువ కాలం అధికారంలోనే ఉంది. అదే వారికి ప్లస్ అయింది అని దువ్వాడ అంటున్నారు. తాను రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చానని అయన చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున తొలిసారి 2005లో జెడ్పీటీసీగా గెల్చిన దువ్వాడ శ్రీను తరువాత కాలంలో ప్రజరాజ్యం నుంచి ఎమ్మెల్యే గా టెక్కలి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడారు. 2014 నాటికి వైసెపీలో చేరి అదే సీటు నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. ఇక 2019 లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజారిటీతోనే ఓడారు. ఇపుడు పాత పగలన్నీ చల్లారే విధంగా అచ్చెన్నను ఓడించి తీరుతానని అంటున్నారు. తనకు జగన్ పూర్తి మద్దతుగా ఉన్నారని, జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంబం కూడా అండగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి సరైన వ్యూహంతోనే దువ్వాడ దూసుకెళ్తున్నారు. అలా అచ్చెన్నాయుడుకు టెక్కలి టెన్షన్ పెట్టేశారు.