అధికార పార్టీ కనుసన్నల్లో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, హద్దులు మీరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న విషయం విదితమే. ఓట్లేసేందుకు జనం వస్తున్నప్పుడు, ఉద్యోగులకు ఏంటి సమస్య.? అన్న చిన్న లాజిక్‌ని ఉద్యోగులు మిస్ అవుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి.. దుబ్బాక ఉప ఎన్నిక కూడా జరిగింది. బీహార్ లోనూ ఎన్నికలు జరిగాయి.. కేరళ లోనూ ఎన్నికలు జరిగాయి. అక్కడెక్కడా ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో ఎవరూ ఇలా చెత్త వాదనల్ని తెరపైకి తీసుకురాలేదు. అంటే, వాళ్ళెవరికీ ప్రాణాల మీద భయం లేదనుకోవాలా.? ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని మాత్రమే ప్రాణ భయం వెంటాడుతోందని అనుకోవాలా ?
స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ హయాంలో జరగడం అధికారంలో వున్నవారికి ఇష్టం లేదు. అదే ఎజెండా భుజాన వేసుకుని, కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు రోజుకో కొత్త కథని తెరపైకి తెస్తున్నారు. ‘ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టకుని.. కరోనా పాన్డమిక్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని.. రెండు అలాగే మూడు దశల పంచాయితీ ఎన్నికల్ని రీ-షెడ్యూల్ చేయాలి’ అంటూ ఉద్యోగ సంఘాల నేతలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఎలాగోలా పంచాయితీ ఎన్నికల్ని వాయిదా వేయించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్న దరిమిలా, రోజుకో కుటిల యత్నం తెరపైకొస్తోంది.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామనే వంకతో, ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సహకరించలేదు.. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగులు తొలి దశ పంచాయితీ ఎన్నికల నామినేషన్ పర్వానికి సిద్ధమవలేదు సరికదా, డుమ్మా కొట్టేశారు. ఆ కారణంగానే తొలి దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రీ-షెడ్యూల్ అయ్యింది. అది రీ-షెడ్యూల్ అయ్యింది గనుక, రెండు అలాగే మూడు దశల పంచాయితీ ఎన్నికల్ని రీ-షెడ్యూల్ కోరడమంటే సొంత లబ్ది కోసం ఎత్తుకున్న అజెండా లాగ ఉంది కాని రాష్ట్రానికి , ప్రజల శ్రేయస్సు కొరకు అయితే కాదన్నది స్పష్టంగా అర్ధమవుతుంది.