బుట్టా రేణుక వివాదాన్ని రగిలించిన వైసిపి

ఆంధ్రా ప్రతిపక్ష వైసిపి పార్టీ ఇటు టిడిపిని, అటు బిజెపిని ఇరకాటంలోకి నెట్టేందుకు కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చింది. కర్నూలు సీటులో వైసిపిలో గెలిచి అధికార టిడిపిలో కొనసాగుతున్న బుట్టా రేణుక పై అనర్హత వేటు వేయాలంటూ రెండేళ్ల క్రితమే వైసిపి స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. బుట్టా రేణుక ప్రస్తుతం ఎంపిగా కొనసాగుతున్నారు. మొన్నటికి మొన్న వైసిపి ఎంపీలందరూ చేసిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. కానీ బుట్టా రేణుక రాజీనామా చేయలేదు. దీంతో ఆమె విషయంలో ఇటు టిడిపి, అటు బిజెపిని ఇరకాటంలోకి నెట్టేందుకు వైసిపి కొత్త వివాదాన్ని రేపింది.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగే అఖిలపక్ష సమావేశానికి వైసిపి తరపున ఎంపీ బుట్టా రేణుకకు ఆహ్వానం అందింది. ఈ అంశంపై వైసిపి నేతలు మండిపడుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం పార్టీ ఫిరాయించి వెళ్లిపోయిన బుట్టా రేణుక మీద అనర్హత వేటు వేయకుండా తాత్సారం చేస్తూ ఇప్పుడు ఆమెకు పైగా ఎలా ఆహ్వానం పంపుతారని వైసిపి నేతలు స్పీకర్ ను ప్రశ్నిస్తున్నారు. ఆమె పై అనర్హత వేటు వేయాలని రెండేళ్లుగా కోరుతున్న స్పీకర్ స్పందించటం లేదని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసిపి నుంచి ఎంపీగా గెలిచిన ఎంపీ బుట్టా రేణుక తదనంతర కాలంలో టిడిపిలో చేరారు. దీంతో అప్పటి నుంచి ఆమె టిడిపి ఎంపీగానే నడుచుకుంటున్నారు. కానీ పార్లమెంటులో మాత్రం ఆమె వైసిపి ఎంపీగా రికార్డులో ఉంది. దీంతో రేపటి నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష సమావేశానికి వైసిపి తరపున హాజరు కావాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం రాజీనామాలు చేసి ఉన్న మాజీ ఎంపీలకు పుండు మీద కారం చల్లినట్లైంది. వైసిపి ఎంపీలంతా విభజన సమస్యలు పరిష్కరించాలని రాజీనామాలు చేశామని అటువంటప్పుడు బుట్టా రేణుకకు మీరెలా వైసిపి సభ్యురాలి హోదాలో ఆహ్వానం పంపిస్తారని వారు స్పీకర్ ను ప్రశ్నిస్తున్నారు. ఇది టిడిపి, బిజెపి కలిసి ఆడుతున్న నాటకమని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు.

బిజెపితో టిడిపి దోస్తి కట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం వారు ఆడుతున్న డ్రామా అని వైసిపి ఆరోపిస్తుంది. స్పీకర్ కు రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా కూడా బుట్టా రేణుక సభ్యత్వం రద్దు చేయట్లేదు అంటే వారిద్దరు దోస్తులుగానే కొనసాగుతున్నారని చెప్పటానికి ఇది చాలదా అంటూ వారు విమర్శిస్తున్నారు. అలాగే రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో వైసిపి మాజీ ఎంపీలంతా ఢిల్లికి చేరుకున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా వారు పార్లమెంటు హాలులో నిరసన తెలుపనున్నారు. మరోవైపు టిడిపి నేతలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతున్నారు. దీంతో ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలుగు వారి హడావిడి ఈసారి కూడా గట్టిగానే ఉండే అవకాశం ఉంది.