ఫ్లాష్.. ఫ్లాష్.. సిట్ విచారణను బహిష్కరించనున్న వైసిపి నేతలు

విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటన విచారణను బహిష్కరించాలని  వైసిపి నిర్ణయించింది.  హైదరాబాద్ కు వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ పై మొన్న 25వ తేదీన ఓ యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై చంద్రబాబునాయుడు సిట్ తో విచారణ చేయిస్తున్నారు. అయితే మొదటి నుండి హత్యాయత్నం ఘటనను చంద్రబాబు, మంత్రులు, డిజిపి అందరూ ఓ డ్రామాగా కొట్టి పారేస్తున్నారు. అందుకే సిట్ విచారణపై వైసిపి నేతలు మండిపడుతున్నారు.

 

నిష్పక్షికంగా విచారణ జరగాలన్నా, వాస్తవాలు బయటకు రావాలన్నా థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. వైసిపి ఉద్దేశ్యంలో థర్డ్ పార్టీ అంటే కేంద్ర దర్యాప్తు సంస్ధలు కానీ లేకపోతే జ్యుడిషియల్ విచారణ కానీ. అయితే వైసిపి డిమాండ్ ను చంద్రబాబు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. దాంతో రెండు పార్టీల మధ్య విచారణ తీరుతెన్నులపై పెద్ద మాటల యుద్దమే జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఇద్దరు వైసిపి నేతలకు సిట్ నుండి నోటీసులు అందాయి. నవంబర్ 2వ తేదీన విశాఖపట్నంలోని సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలంటూ అందులో స్పష్టం చేశారు.

 

అయితే, ఆ విచారణకు హజరుకాకూడదని వైసిపి నేతలు నిర్ణయించుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం ఎంఎల్ఏ పీడిక రాజన్నదొర తో పాటు సీనియర్ నేత మజ్జి శ్రీనివాసరావుకు నోటీసులు అందాయి. అయితే సిట్ విచారణను తమ పార్టీ వ్యతరేకిస్తున్న కారణంగా 2వ తేదీ విచారణకు హాజరు కాకూడదని పై ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. కేసు విచారణ కోర్టుకు చేరుకున్నపుడు న్యాయమూర్తి ఎదుటే తమ వాదనలు, సాక్ష్యాలు ఇవ్వాలని అనుకున్నారు. కేసు విచారణ కోర్టుకు చేరేదెప్పుడో వీళ్ళ సాక్ష్యం ఇచ్చేదెపుడో చూడాల్సిందే.