కరకట్ట మీద అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబునాయుడుపై వైసిపి ఎంఎల్ఏలు మళ్ళీ ఒత్తిడి మొదలుపెట్టారు. తక్షణమే చంద్రబాబు అక్రమ నివాసం నుండి ఖాళీ చేయాలంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు మంగళగిరి నియోజకవర్గ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పదే పదే చంద్రబాబును కోరుతున్నారు.
గడచిన ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానదిలోకి వరద నీరు వచ్చేస్తోంది. ప్రకాశం బ్యారేజి నుండి నీటిని విడుదల చేసేస్తుండంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. దాని వల్ల కరకట్టపైకి కూడా నీరు చేరుకుంటోంది. కరకట్టపైన నిర్మించిన అనేక అక్రమనిర్మాణాల్లో లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఒకటి.
ఆ గెస్ట్ హౌస్ లోనే ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్నారు. చంద్రబాబును ఇల్లు ఖాళీ చేయమని ప్రభుత్వం నోటీసులిచ్చినా ఖాళీ చేయటం లేదు. నది పొంగితే కరకట్టకు ఇబ్బంది తప్పదని జగన్ హెచ్చరించినా చంద్రబాబు కావాలనే ఖాళీ చేయలేదు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు నివాసంలోకి కూడా నీళ్ళు రావటం మొదలైంది. గెస్ట్ హౌస్ మెట్లు ప్రస్తుతానికి ముణిగిపోయాయి. నది కాస్త పొంగితే ఇంట్లోకంతా నీళ్ళు వచ్చేయటం ఖాయం.
అందుకనే సిబ్బంది ముందు జాగ్రత్తగా ఇంటిచుట్టూ ఇసుక బస్తాలను వేయిస్తున్నరు రక్షణగా. అయితే నది పొంగితే ఎంతటి రక్షణ చర్యలు కూడా ఆగవన్న విషయం తెలిసిందే. అందుకనే కుటుంబంతో సహా చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. ఈ పరిస్ధితుల్లో అక్రమ నిర్మాణాన్ని చంద్రబాబు తక్షణమే ఖాళీచేసి వెళ్ళిపోవాలని ఆర్కె విజ్ఞప్తి చేస్తున్నారు.