పోలీసు ప్రేమ మోసం… మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వారిద్దరు కూడా ప్రజలకు ఆదర్శవంతంగా ఉండే వృత్తిలో ఉన్నారు. ఉద్యోగంలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రియుడి మోసంతో తట్టుకోలేకపోయిన ఆ ఇల్లాలు చివరికి ప్రాణాలు విడిచింది.

రంగారెడ్డి జిల్లా వెంకాపల్లి గ్రామానికి చెందిన మాల రాజేంద్రకు రెండేళ్ల క్రితం ఇండో టిబెటిన్ బోర్డర్ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా  ఉద్యోగం వచ్చింది. పందలపాకలో ఉన్న బెటాలియన్ లో రాజేంద్ర చేరారు. ఇదిలా ఉండగా విశాఖ జిల్లాలోని మునగపాక మండలం, నాగవరం గ్రామానికి చెందిన కరణం కళావతి, రమణ దంపతుల చిన్న కుమార్తె కరణం కుమారి(22) డిగ్రీ వరకూ చదువుకోగా 2017 మే 1న ఐటీబీపీలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ మేరకు పందలపాకలో ఉన్ని బెటాలియన్‌లో చేరింది. అక్కడ కుమారికి రాజేంద్ర ఉద్యోగ రీత్యా పరిచయమయ్యాడు. ఇద్దరూ తెలుగు వారు కావడంతో చనువు పెరిగి ప్రేమకు దారి తీసింది. అయితే వీరివి వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.

వారిద్దరు ఒకే దగ్గర ఉంటుండడంతో శారీరకంగా కూడా దగ్గరయ్యారు. దీంతో తనకు రక్షణ కావాలని కుమారి డిమాండ్ చేయడంతో నాలుగు నెలల క్రితం సింహచలంలో రాజేంద్ర కుమారిని వివాహం చేసుకున్నాడు. అనంతరం వారు ఆనందపురంలో ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నారు. కానీ రెండు నెలల కిందట వారిద్దరి మధ్య గొడవ జరగడంతో కుమారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయింది. సకాలంలో పక్కవారు చూసి ఆస్పత్రిలో చేర్పించడంతో కుమారి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత బెటాలియన్ అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయినా వారిద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. 

రాజేంద్ర ఈ నెల 7 న శిక్షణ నిమిత్తం ఛండీఘర్ వెళ్లాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ కుమారి మంగళవారం రాజేంద్రకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని తెలిపింది. దీంతో రాజేంద్ర ఆమెను ఓదార్చకుండా నువ్వ చనిపోతే తాను కూడా చనిపోతానన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత కుమారి వారి తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పింది. వారు మేమొస్తున్నామని దయచేసి తొందరపడవద్దని ఓదార్చారు. వారు అక్కడికి చేరుకునే లోపే ఫ్యాన్ కు ఉరేసుకొని కుమారి చనిపోయింది. పోలీసులు రాజేంద్ర పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పోలీసులై ఉండి ఇలా చేయడంతో అంతా షాకయ్యారు.