ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తున్నాయనేది పచ్చి వాస్తవం. ఒక్కొక పార్టీ ఒక్కో సామజికవర్గం అండతో ముందుకు సాగుతోంది. తెలుగుదేశం కమ్మ సామాజికవర్గం వెన్నుదన్నుతో నిలబడుతూ వస్తుంటే ఆనాడు కాంగ్రెస్, ఇప్పుడు వైకాపాకు రెడ్డి సామాజికవర్గం సంపూర్ణ మద్దతునిచ్చింది. అలాగే జనసేనకు కాపుల సపోర్ట్ ఉంది. అయితే టీడీపీ, వైసీపీలకు ఉన్నస్థాయిలో పూర్తి మద్దతు మాత్రం లేదు. ఆ పార్టీ మద్దతే ఉండి ఉంటే గడిచిన ఎన్నికల్లో సీన్ వేరేలా ఉండేది. అయితే జనసేన సాధించిన 6.8 శాతం ఓట్లలో మెజారిటీ ఓట్లు కాపులవే.
నిజానికి నాయకులంతా తమకు కులం పట్టింపు లేదని, అన్ని కులాలు ఒక్కటేనని అంటుంటాయి. కానీ లోపల మాత్రం జరగాల్సిన రాజకీయాలు జరిగిపోతుంటాయి. ఆ సంగతిని అటుంచితే 2024 ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ కూడ కుల రాజకీయాలకు తెర తీస్తోంది. వాస్తవానికి వీరిది హిందూత్వ ధోరణిలో సాగే మత రాజకీయం. కానీ ఏపీలో అది చెల్లుబాటు కాదు కాబట్టి కుల రాజకీయాన్నే నమ్ముకున్నారు. కమ్మలు టీడీపీ, రెడ్లు వైసీపీ కాబట్టి మిగిలిన పెద్ద సామాజికవర్గం కాపులను టార్గెట్ చేశారు. బీజీపీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ, ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు ఇద్దరూ కాపు వర్గానికి చెందినవారే.
అలాగే పక్కన తెచ్చి పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడ కాపు వర్గానికి చెందిన వ్యక్తే. ఓటు బ్యాంకు విషయానికి వస్తే బీజేపీతో పోల్చుకుంటే జనసేన ఓటు బ్యాంకు పెద్దది. అందుకే ఢిల్లీకి పిలిచి మరీ పొత్తు పెట్టుకున్నారు. ఆయన ఉంటే కాపు ఓట్లను భారీగా కొల్లగొట్టవచ్చనేది వారి ప్లాన్. సరే కాపు ఓట్లను టార్గెట్ చేయడం వరకు బాగానే ఉంది. మరి అదే వర్గానికి చెందిన పవన్‌ను తొక్కిపెడుతూ కాపులను ఆకర్షించాలని అనుకోవడమే విడ్డూరంగా ఉంది. ఇప్పటికిప్పుడు చూసుకుంటే కాపులను బీజేపీ కంటే పవనే అధికంగా ఆకర్షించగలరు. మొదటిసారి మొహంచాటేసినా వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు కాపుల మద్దతు పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
కాపులు తాము మద్దతిస్తున్న నాయకుడు కూటమిలో అత్యంత కీలకంగా ఉండాలని భావిస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయిలో నిలవాలని పట్టుబడతారు. కానీ బీజేపీ వైఖరి చూస్తే ఎంతసేపూ పవన్‌ను నిర్లక్ష్యం చేస్తుండటం, సర్దుకుపొమ్మనడం చేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో పనిగట్టుకుని మరీ పోటీ నుండి విరమించుకునేలా చేశారు. త్వరలో జాత్రాగబోయే తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన అభ్యర్థికి కాకుండా బీజేపీ వ్యక్తిని నిలబెట్టాలని అనుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో పూర్తిగా ఆశక్తుడ్ని చేసి పక్కన కోర్చోబెట్టేలా ఉన్నారు. ఇదంతా కాపులు గమనిస్తూనే ఉన్నారు. మరి తమ ప్రతినిధిగా భావిస్తున్న, భావించాలనుకుంటున్న వ్యక్తిని అలా కిందకు లాగేస్తున్న బీజేపీకి వారు మద్దతివ్వడం జరిగే పనని అనిపించట్లేదు.