2024 ఎన్నికల్లో వైసీపీ సెంచరీ అయినా కొట్టగలదా.?

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలొస్తే ఏంటి పరిస్థితి.? అన్నదానికి సంబంధించి పలు సర్వేలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి. 60 శాతం మంది ఎమ్మెల్యేలపై నెగెటివిటీ వుందంటూ ఆ మధ్యన అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత స్వయంగా వ్యాఖ్యానించిన విషయం విదితమే.

‘ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకత లేదు.. వున్నా చాలా తక్కువ.. కానీ, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వుంది.. 60 శాతానికి పైగా ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదు..’ అంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో తెటతెల్లమైన దరిమిలా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ఎమ్మెల్యేలని నియోజకవర్గాల్లో తిప్పుతున్నారు.

అయితే, ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పుణ్యమా అని ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగిపోతోంది. ప్రజా ప్రతినిథులకు చీవాట్లు తప్పడంలేదు. ఈ క్రమంలో కొందరు అగ్రెసివ్‌గా వ్యవహరించి ఇంకాస్త ఎక్కువ చీవాట్లు తింటోన్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇదిలా వుంటే, తాజాగా వెలుగు చూసిన ఓ సర్వేలో వైసీపీకి 100 సీట్లు రావడం కష్టమేనని తేలిందట. సెంచరీ కొట్టకపోతే ఎలా.? అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. 90 సీట్లు వచ్చినాసరే, అధికారమైతే వైసీపీదే.. అన్న భావన కొందరు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఓ నేషనల్ సర్వే నివేదిక ప్రకారం చూస్తే 133 సీట్లు వైసీపీకి ఖచ్చితంగా వస్తాయట.

సర్వేల్ని నమ్ముకుని రంగంలోకి దిగితే నట్టేట్లో మునిగిపోవడమే. కింది స్థాయిలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తమవ్వాలి.