పోయిన ఎన్నికల్లోనే ఆ జిల్లాలో టిడిపి దెబ్బతిన్నది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఏడు చోట్ల వైసిపినే గెలిచింది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో కూడా ఏదో ఒకరకంగా బయటపడింది. సరే తర్వాత జరిగిన రాజకీయపరిణామాల్లో ఓ వైసిపి ఎంఎల్ఏని ప్రలోభాలకు గురిచేసి లాక్కున్నారనుకోండి అది వేరే సంగతి. హోలు మొత్తం మీద చూస్తే అప్పటి నుండి ఇప్పటి వరకూ జిల్లా మొత్తం మీద రాజకీయంగా అయితే వైసిపిదే పై చేయిగా అర్ధమవుతుంది. ఇంతకీ ఆ జిల్లా ఏదో ఈ పాటికే అర్ధమైపోయుంటుంది. అదేనండి నెల్లూరు జిల్లానే. విచిత్రమేమిటంటే అధికారంలో ఉన్నా రోజురోజుకు జిల్లాలో టిడిపి పరిస్ధితి బలహీనమైపోతోంది.
ఎలాగూ షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీని పటిష్టం చేయటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావటం లేదు. పైగా పోయిన ఎన్నికలకన్నా ఇపుడు మరింత వీకైపోయింది. ఎలాగంటే, జిల్లాలోని రాజకీయంగా పెద్ద కుటుంబాలన్నీ ఇపుడు వైసిపిలోనే ఉన్నాయి. నల్లపురెడ్డి, ఆనం, నేదురుమల్లి, మేకపాటి కుటుంబాల నుండి పలువురు నేతలు బాగా యాక్టివ్ గా ఉన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి కొడుకు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఈమధ్యనే ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరారు.
అలాగే, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కొడుకు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి కూడా జగన్ పాదయాత్ర సందర్భంగా వైసిపిలో చేరారు. సరే నెల్లూరు మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొడుకు ఆత్మకూరు ఎంఎల్ఏ మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు, మాజీ ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసిపిలో బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఇంకోవైపు చూస్తే టిడిపిలో చెప్పుకోతగ్గ రాజకీయ కుటుంబాలే లేవు.
దానికితోడు సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరో మంత్రి పొంగూరు నారాయణకు ఏమాత్రం పడదు. నారాయణకు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి పడదు. సోమిరెడ్డికి ఆదాలకు పడదు. పోనీ జిల్లా మొత్తాన్ని సమన్వయం చేయగలిగిన సీనియర్ నేతలెవరైనా ఉన్నారా అంటే అదీ లేదు. ఈమధ్యనే తెలుగుదేశంపార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలు వైసిపిలో చేరిపోతున్నారు. వీటిన్నంటికి అదనంగా నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత.
ఇక ఆర్ధిక విషయాలకు వస్తే తెలుగుదేశంపార్టీ చాలా బలంగా ఉంది. జిల్లాలో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల్లో చాలామంది ఆర్ధికంగా బాగా బలోపేతమైపోయారు. టిడిపి నేతలతో పోల్చుకుంటే వైసిపి నేతలు వీకనే చెప్పాలి. అయితే వైసిపిలో కూడా ఆర్ధికంగా బలంగా ఉన్న వేమిరెడ్డి, మేకపాటి లాంటి నేతలు లేకపోలేదు. మొన్నటి జగన్ పాదయాత్ర తర్వాత పార్టీలో బాగా ఊపొచ్చింది. అలాగే జనాల్లో మంచి స్పందనా వచ్చింది. పాదయాత్ర తర్వాత నుండి పార్టీ నేతల్లో మంచి జోష్ కనిపిస్తోంది. కాకపోతే అన్ని జిల్లాల్లో గల్లంతైనట్లే ఈజిల్లాలో కూడా వైసిపి ఓట్లు సుమారు 5 లక్షల దాకా గల్లంతయ్యాయట. వాటిని గనుక వెనక్కు తెచ్చుకుంటే పార్టీకి ఎదురే ఉండదని సమాచారం. అదే సమయంలో పాదయాత్రలో స్పందించిన జనాలు గనుక వైసిపికి సానుకూలంగా స్పందిస్తే తెలుగుదేశంపార్టీకి మొన్న వచ్చిన సీట్లు కూడా అనుమానమే.