పాపం వైసీపీ ఎమ్మెల్యే రోజాకి ‘ఆ కోరిక’ ఇకపై తీరదా.?

Will YCP MLA Roja's wish come true?

Will YCP MLA Roja's wish come true?

మామూలుగా అయితే, ఎమ్మెల్యే అవడం అనేది ఆమెకు చాలా తేలికైన వ్యవహారమే. కానీ, చాలా కష్టపడింది. సొంత పార్టీ నుంచే వెన్నుపోట్లు ఎదురవడంతో టీడీపీలో వున్నప్పుడు సినీ నటి, అప్పటి టీడీపీ మహిళా అధ్యక్షురాలు రోజా ఎమ్మెల్యే కాలేకపోయిన విషయం విదితమే. ఎలాగైతేనేం, టీడీపీని వీడి.. వైఎస్ జగన్ పంచన చేరాక, వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ‘అసెంబ్లీలో అధ్యక్షా’ అని అనగలిగారుగానీ, అది టీడీపీ హయాం. దాంతో, రోజా గొంతు నొక్కేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. మళ్ళీ 2019 ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈసారి సొంత పార్టీ ఆమెను తొక్కేసింది. మంత్రి అవ్వాల్సిన రోజాకి, కుల రాజకీయ సమీకరణాలు అడ్డం వచ్చాయి. దాంతో, ఆమెను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవికి పరిమితం చేశారు ముఖ్యమంత్రి జగన్. ఎమ్మెల్యే.. ఆపై ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ హోదా.. ఇన్నీ వున్నా, ఆమెకు సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో.. సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురవుతోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రెబల్స్ ఆమెకు తలనొప్పిగా మారారు.

ఈ విషయాన్ని ఆమె చెబుతూ తాజాగా వాపోయారు. ‘సొంత పార్టీలోనే రెబల్స్ రూపంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల్ని ఓడించేందుకు రెబల్స్ ద్వారా పెద్దయెత్తున స్థానిక వైసీపీ నేతలే డబ్బులు పంచుతున్నారు..’ అంటూ కంటతడిపెట్టినంత పనిచేశారు. ‘రెబల్స్‌కి మద్దతిస్తోన్న నేతలపై అధిష్టానంతో మాట్లాడి వేటు వేయిస్తాను..’ అని చెప్పారు రోజా. కానీ, అది సాధ్యమేనా.? ఎందుకంటే, జిల్లాకి చెందిన మంత్రుల సపోర్ట్ కాస్తా, రోజా వ్యతిరేకులకే వున్నట్లు కనిపిస్తోంది. మరోపక్క, రోజాని ఇంతలా ఇబ్బంది పెట్టడం వెనుక పెద్ద కారణమే వుందనీ, ఆమెకు మంత్రి పదవి రానీయకుండా వుండేందుకు.. ఆమె ఇమేజ్‌ని తక్కువ చేసి చూపించే ప్రయత్నమే ఇదంతా అనీ.. అంటున్నారు. మొదటి దఫా కుదరకపోయినా, రెండో దఫా (మొదటి మంత్రి వర్గం ఏర్పాటైన రెండున్నరేళ్ళ తర్వాత.. అంటే, ఆరు నెలల తర్వాత) తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన రోజా కోరిక నెరవేరేలా కనిపించడంలేదన్నమాట.