విశాఖ రైల్వే జోన్ కోసం రాజీనామా.! విజయసాయిరెడ్డి మాటల్లో నిజమెంత.?

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు గతంలో రాజీనామా చేశారు. కానీ, ప్రత్యేక హోదా వచ్చిందా.? రాలేదాయె.! ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ రైల్వే జోన్ కోసం రాజీనామా చేస్తానంటున్నారు. ‘కేంద్రం రైల్వే జోన్ ప్రకటించింది.. రైల్వే జోన్ ఇస్తుంది.. ఇవ్వకపోతే రాజీనామా చేస్తా..’ అన్నది విజయసాయిరెడ్డి ప్రకటన.

వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ‘రాజీనామా ప్రకటన’ అందర్నీ విస్మయానికి గురిచేసింది. రాజీనామా చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశ్యం వైసీపీకి వుంటే, మూడేళ్ళుగా ప్రత్యేక హోదా కోసం మౌనంగా వుండదు. రైల్వే జోన్ విషయంలో కేంద్రం నానా రకాల డ్రామాలూ ఆడతున్నా, చూసీ చూడనట్లు వదిలెయ్యరు. కేంద్రాన్ని నిలదీసి తమ చిత్తశుద్ధిని చాటటుకునేవారు.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇప్పటికే ప్రకటితమైంది. రైల్వే జోన్ ఇచ్చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ, విశాఖ వేదికగా చంద్రబాబు హయాంలోనే ప్రకటించారు. అప్పుడే ఆయన చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్, పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలా వాడుకున్నట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఏటీఎం నుంచి చంద్రబాబు ఆయన తనయుడు ఎంత ‘డ్రా’ చేశారు.? అందులో ఎంత రికవరీ చేయగలిగారు.? అన్నదానిపై అటు కేంద్రమూ సమాధానం చెప్పలేదు, ఇటు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కూడా చెప్పడంలేదాయె. అది వేరే వ్యవహారం.

రైల్వే జోన్‌కి కేంద్రమే అడ్డంకి. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి రైల్వే జోన్ ఇవ్వడం ఇష్టం లేదు. అలాగని, ఇవ్వకుండా వుండడంలేదు. జస్ట్ రైల్వే జోన్‌ని ప్రకటించి ఊరుకున్నారంతే. అది అస్సలు ముందుకు కదలదుగాక కదలదు. ఇంకో ఐదేళ్ళ తర్వాత కూడా రైల్వే జోన్ వ్యవహారం అలాగే వుంటుంది.

‘మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.. ప్రత్యేక రైల్వే జోన్ మీద నిర్ణయం తీసుకున్నాం..’ అని తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ వెల్లడించారు. ముందే చెప్పుకున్నాం కదా.. రైల్వే జోన్ ముందుకు కదలదు.. విజయసాయిరెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరమూ రాదు ఇప్పట్లో.