ఏ పార్టీకి అయినా ప్లీనరీ సమావేశాలు అత్యంత ప్రతిష్టాత్మకం. అధికారంలో వున్న పార్టీ, ప్లీనరీ సమావేశాల్ని ఇంకాస్త హంగామాతో నిర్వహిస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్లీనరీ సమావేశాలకు సిద్ధమయ్యింది. ప్లీనరీ ద్వారా వచ్చే ఎన్నికలకు అధినేత వైఎస్ జగన్ సమర శంఖం పూరిస్తారనే నమ్ముతున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.
అంతా బాగానే వుందిగానీ, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎక్కడ.? ఆమె తెలంగాణలో వున్నారా.? లేదంటే, ఆంధ్రప్రదేశ్‌లో వున్నారా.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. హైద్రాబాద్‌లోనే వుంటూ, వైఎస్ షర్మిల పార్టీ కోసం తెరవెనుకాల అన్నీ సమకూర్చడంలో బిజీగా వున్నారు వైఎస్ విజయమ్మ.. అన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది.
గతంలో వైఎస్ జగన్ కోసం వైఎస్ విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయి, జైలుకు వెళ్ళాక.. వైసీపీ బాధ్యతల్ని స్వయంగా విజయమ్మ మోశారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం అసలు పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించాల్సిన పరిస్థితి విజయమ్మకు వచ్చింది.
కానీ, ప్లీనరీ సమావేశాల్లో విజయమ్మ లేకపోతే, తప్పుడు సంకేతాలు వెళతాయి పార్టీ శ్రేణులకి. విపక్షాలకు ఇదో అస్త్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే విజయమ్మ కూడా ప్లీనరీ సమావేశాలకు హాజరవ్వాలనే అనుకుంటున్నారట. ఆమె మొదటి ప్రసంగం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.