టిడిపి కంచుకోట బద్దలవుతుందా ? మళ్ళీ అధికారం డౌటే ?

పోయిన ఎన్నికల వరకూ ఒకటి. వచ్చే ఎన్నికల్లో ఒకటి అన్నట్లుంది తెలుగుదేశం పార్టీ పరిస్దితి. టిడిపి ఆవిర్భావం నుండి కంచుకోటలుగా నిలుస్తున్న నియోజకవర్గాల్లో హిందుపురం ముందు వరసలో ఉంటుంది. అటువంటి హిందుపురంలోనే పార్టీ పరిస్ధితి బాగా దిగజారిపోయింది. థాంక్స్ టు బాలకృష్ణ అనే చెప్పుకోవాలేమో.

 

టిడిపి పరిస్ధితి  బాగా అధ్వాన్నంగా ఉంది అని చెప్పుకున్న రోజుల్లో కూడా హిందుపురంలో నామినేషన్ వేస్తే చాలు టిడిపి అభ్యర్ధి గెలిచిపోయేవారు. పోటి చేస్తున్న అభ్యర్ధిగా ఎవరనేది కూడా చూడకుండా ఓటర్లు తెలుగుదేశంపార్టీకి ఓట్లేసేస్తారు. టిడిపికి సంబంధించి అంతటి ఘన చరిత్రున్న హిందుపురంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచేది అనుమానమే అంటున్నారు. హిందుపురంలోనే అటువంటి పరిస్ధితులున్నాయంటే ఆ ఘనతంతా నందమూరి బాలకృష్ణదనే చెప్పాలి.

 

ఈ నియోజకవర్గం నుండి టిడిపి వ్యవస్ధాపకుడు నందమూరి తారక రామారావు మూడు సార్లు గెలిచారు. తర్వాత ఆయన వారసునిగా నందమూరి హరికృష్ణ గెలిచారు. పోయిన ఎన్నికల్లో వారసత్వ హోదాలోనే నందమూరి బాలకృష్ణ కూడా గెలిచారు. మధ్యలో అబ్దుల్ ఘని కూడా ఎంఎల్ఏ అయ్యారు. ఎన్టీయార్, హరికృష్ణ ఇక్కడ గెలిచినా హిందుపురంలో ఉండేవారు కాబట్టి తమ తరపున నమ్మకస్తులను పెట్టుకుని పనులు జరిపించేవారు. కాబట్టి ఎప్పుడూ సమస్యలు రాలేదు. నియోజకవర్గంలోని సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ పార్టీని జాగ్రత్తగా కాపాడుకునేవారు. అబ్దుల్ ఘని స్ధానికుడే కావటంతో సమస్యే లేదు.

 

సమస్యంతా నందమూరి బాలకృష్ణతోనే మొదలైంది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే బాలకృష్ణ తన ప్రతినిధిగా శేఖర్ అనే పిఏని పెట్టుకున్నారు. ఆ పిఏ మొత్తం కంపుచేశాడు. నియోజకవర్గంలోని సీనియర్లకు బాలకృష్ణ అందుబాటులో ఉండేవారు కాదు. పోనీ నేతలెవరైనా ఫోన్ చేస్తే మాట్లాడేవారా అంటె అదీ లేదు. నేతలు మాట్లాడినా పిఏతోనే. బాలకృష్ణ ఏమి చెప్పాలన్నా పిఏతోనే. అంటే బాలకృష్ణకు నేతలకు మధ్య పిఏ అడ్డుగోడైపోయారు. దాంతో శేఖర్ దే ఇష్టారాజ్యమైపోయింది. నేతలెవరినీ లెక్కచేసేవారు కాదు పిఏ. అలా మూడేళ్ళు గడిచిపోయింది.

 

పిఏ ఆగడాలను తట్టుకోలేక, బాలకృష్ణ పట్టించుకోకపోవటంతో చివరకు నేతలతో పాటు జనాలు కూడా బాలకృష్ణపై తిరుగుబాటు చేశారు. నేతల్లో చాలామంది పార్టీకి రాజీనామాలు చేసేశారు. దాంతో అప్పుడు చంద్రబాబు జోక్యం చేసుకుని పిఏని మార్చేశారు. ఆ తర్వాత కృష్ణమూర్తిని నియమించారు. ఆయన రీజనబుల్ గానే ఉండేవారని పేరు. ఆయనుండగానే అదనంగా వీరయ్యను కూడా పిఏగా నియమించారు. దాంతో వారిద్దరికి పడలేదు. దాంతో కృష్ణమూర్తి వెళ్ళిపోయారు. వీరియ్యకు శేఖర్ కు పెద్ద తేడా లేదని ఆరోపణలు మొదలయ్యాయి. దాంతో నాలుగో పిఏగా శ్రీనివాసరావును నియమించారు.

 

ఇపుడు వీరయ్య, శ్రీనివాసరావుకు పడటం లేదు. మరో ఏడు నెలల్లో ఎన్నికలొస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి దారుణంగా తయారైంది. ఇంకోవైపు వైసిపి బాగా పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ గెలవదని టిడిపి నేతలే చెప్పుకుంటున్నారు.  టిడిపి మీడియాలో కూడా అదే విధంగా కథనాలు వస్తున్నాయి. దాంతో  కంచుకోట బద్దలవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందుపురంలో గనుక టిడిపి ఓడిపోతే నందమూరి బాలకృష్ణ  రికార్డు సృష్టించబోతున్నట్లే..