మొన్న జరిగిన పోలింగ్ లో తెలుగుదేశంపార్టీకి ప్రకాశం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఖాయంగా వస్తాయని పార్టీ అంచనా వేస్తోందని సమాచారం. సోమవారం చంద్రబాబు ఆధ్వర్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులు, నేతలతో ప్రత్యేక సమావేశం జరగబోతోంది. టిడిపికి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేసేందుకే చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ తర్వాత చంద్రబాబు ఓ నివేదికను తెప్పించుకున్నారు. అయినా కానీ పార్టీ పరంగా అభ్యర్ధులు, నేతల నుండి నివేదిక కోరుతున్నారు.
సరే ఇతర జిల్లాల నేతలు తయారు చేసిన నివేదిక ఎలాగున్నా ప్రకాశం జిల్లా నేతలు మాత్రం జిల్లాలోని 12 సీట్లలో పార్టీకి తొమ్మిది వస్తాయని నివేదికలు సిద్ధం చేసినట్లు చంద్రబాబు అనుకూల మీడియా ప్రచారం మొదలుపెట్టింది. పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య ఫించన్ల లాంటి సంక్షేమ పథకాల వల్ల జనాలు టిడిపికి విరగబడి ఓట్లేశారని నేతలు నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం.
మూడు నాలుగు నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్ధులు గట్టిపోటీ ఇచ్చినా అంతిమ విజయం మాత్రం టిడిపిదే అని చంద్రబాబు మీడియా చెప్పింది. బూత్ లెవల్ కార్యకర్తల అంచనాల మేరకు ప్రతీ బూత్ లోను సుమారు 20 ఓట్లు వైసిపికన్నా అధికంగా టిడిపికి పడ్డాయట. దానివల్ల టిడిపి గెలుపు సులభమైందనే అంచనాలతో నేతలు లెక్కలు కట్టారు.
ప్రతీ నియోజకవర్గంలో సగటున 200 పోలింగ్ కేంద్రాలున్నాయట. చాలా చోట్ల ప్రత్యర్ధి పార్టీ నుండి గట్టి పోటీ ఎదురైనా అంతిమ విజయం మాత్రం టిడిపికే దక్కుతుందనే విశ్వాసంతో నేతలున్నారు. అందుకే ఆ విధంగా నివేదికలను సిద్ధం చేసిన పార్టీ సీనియర్లు చంద్రబాబు ముందు ఉంచుతున్నారు. కొన్ని చోట్ల పార్టీ అభ్యర్ధులకు వెన్నుపోట్లు తప్పలేదట. అదే సమయంలో పార్లమెంటు అభ్యర్ధి నుండి అసెంబ్లీ అభ్యర్ధులకు సహకారం కూడా సరిగా అందలేదట. అయినా జిల్లాలో తొమ్మిది సీట్లు గెలుస్తామని చెబుతున్నారు.