తెలంగాణ రాజకీయాల్లో బాలయ్య తొడగొట్టగలడా?

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

 

బాలకృష్ణ బాక్సాఫీస్ మహారాజు. టాలివుడ్ హీరోలకు ఎవరి తగ్గ ఫ్యాన్స్ వాళ్లకి వున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. అయితే,అందరికంటే భిన్నమయిన ఫాన్స్ ఉన్నోడు బాలయ్య. ఆయన కున్న ఫాన్స్ ఫౌరుష సైన్యం.  ఆయన తొడగొడితే, ఫాన్స్ బాక్సాఫీస్ బద్దలు చేస్తారు. మీసం మెలేస్తే కలెక్షన్ల వర్షం కురిపిస్తారు.  ఆయన పంచ్ డైలాగు వదిలితే,ధియోటర్లో ఈలల, కేకల సునామీ వస్తుంది. ఆయనరూటే సపరేటు. ఆయన ఫాన్స్ కి ప్రాంతీయత లేదు. సరిహద్దుకు అక్కడ ఇక్కడ తెలుగు యువకుల్లో ఆయన మీద ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇది నిన్నటి తెలంగాణ పర్యటనలో రుజువయింది. హిందూపురం నుంచి ఆంధ్ర అసెంబ్లీలో ప్రవేశించిన ఆయన చాలా భారీ పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలోనూ చెలరేగిపోయేందుకు ఆ కథనాయకుడు సిద్దమంటున్నారు. ఇప్పటికే ఖమ్మంలో క్యాంపెన్‌కు శ్రీకారం చుట్టారు. ఇది ఆ నాటి ఎన్టీ ఆర్ ను గుర్తు తెచ్చే విధంగా ఉంటుందని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. ఇది కెసిఆర్ వర్సెస్ బాలయ్యగా మారుతుందా అనేది ఇపుడు మొదలయిన ప్రశ్న. 

బాలకృష్ణ విపరీతంగా ఉన్న క్రేజ్ ను తెలుగుదేశం వాడుకోవాలని చూస్తున్నది.  తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నిక తెలంగాణలో కూడా కీలకమయింది.  ఎందుకంటే, టిడిపికి  ఆంధ్రా పార్టీ అని పేరేసి తెలంగాణ నుంచి తరిమేసేందుకు  తెలంగాణ  రాష్ట్రసమితినేతలు శత విధాల ప్రయత్నించారు.  ఆ పార్టీ చచ్చి పోయిందన్నారు. ఇంకెక్కడి టిడిపి అన్నారు. ఆ ఆధ్యాయం ముగిసిందన్నారు. అయితే, ప్రజల ఆలోచన మరొక విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సెంటిమెంట్ వేవ్ ఉన్న 2014 లోనే  ప్రజలు టిడిపి 15 సీట్లిచ్చి, తెలుగుదేశాన్ని కాపాడుకున్నారు. ఎమ్మెల్యేలంతా అమ్ముడు బోయినా వోటర్ల అండ అలాగే ఉందనేందుకు ఇంటింటికి తెలుదేశం కార్యక్రమానికి వచ్చిన స్పందన చూస్తే అర్థమవుతుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో గెలుపొందితే, టిఆర్ ఎస్ అధినేత జ్యోష్యాన్ని ప్రజలు తిరస్కరించినట్లవుతుంది.

తెలంగాణలో వెనకబడిన తరగతుల ప్రజలు ఇంకా టిడిపితోనే ఉన్నారని రుజువవుతుంది. అందుకే తెలంగాణా టిడిపి అభిమానులు, సానుభూతిపరుల కార్యకర్తలను సమీకరించి, వారిని నిరుత్సాహంనుంచి బయటకు తెచ్చి తెలుగుదేశం జండాను రెపరెపలాడించే బాధ్యతను ఇపుడు బాలయ్య భుజానేసుకోబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి తరఫున ప్రచారాన్ని  బాలయ్యత హోరెత్తించ బోతున్నారు.  అటువైపు కెసిఆర్, ఇటువైపు ఎవరు అనే ప్రశ్న ఉండింది. ఇపుడా ప్రశ్నకు టిడిపి సమాధానం ఇవ్వబోతున్నది. ఇటువైపు స్టార్ క్యాంపెయినర్ బాలయ్య అని చెబుతున్నారు. చాలా రోజుల  తర్వాత   తెలంగాణలో  పర్యటించిన బాలయ్యకు టీడీపీ నేతలు  ఘన స్వాగతం పలికారు. రాయపట్నం నుంచి మథిర వరకు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో వేలాది గా పాల్గొన్నారు.  అంబేద్కర్‌, ఎన్టీఆర్‌ లకు ఆయన  నివాళులర్పించారు. ఈ పర్యటనలో  సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడి బహిరంగ సభలో తెలంగాణ అభివృద్ధి  టీడీపీతో సాధ్యమని చెప్పారు.

సత్తుపల్లి నుంచి, మహాకూటమి తరపున సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థిత్వం దాదాపు ఖాయమని తేలినందున ఆయనకు మద్దతుగా బాలయ్య ప్రచారం ప్రారంభించారు. ఇది తొలి ఎన్నికల సభ. పూర్తిగా విజయవంతమయిందని నాయకత్వం భావిస్తున్నది. టిడిపికి బలమయిన నియోజకవర్గాలతో పాటు ఖమ్మం, నల్గొండ సహా సెటిలర్లు ఎక్కువగా ఉండే గ్రేటర్‌ హైదరాబాద్‌లో బాలయ్యతో క్యాంపెన్‌ నిర్వహించవచ్చని చెబుతున్నారు. ఆయన ప్రచారం కేవలం తెలుగుదేశం అభ్యర్థులకే పరిమితమవుతుందా లేక ఆయన  మహాకుటమి అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేస్తారా అనేది తెలియడం లేదు. కాంగ్రెస్, సిపిఐ మాత్రం ఆయన రాష్ట్రమంతా పర్యటించాలని, మహాకుటమి తరఫున ప్రచారం చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. ఎందుకంటే, సెటిలర్స్ మధ్యే కాదు,  బాలయ్య అభిమానులు తెలంగాణ అంతటా ఉన్నారు. అందుకే ఆయన రాష్ట్రమంతా పర్యటించాలని కోరుతున్నారని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. అటు కెసిఆర్… ఇటు బాలయ్య అని రుజువుచేసుకునేందుకు అవకాశం ఇది. టాలివుడ్ బాక్సాఫీసు అవలీలగా బద్దలు కొట్టే బాలయ్య ఇపుడు బ్యాలెట్ బాక్సాఫీస్ వద్ద ఏమవుతాడో చూడాలి.