పెనుగొండలో టిడిపికి హ్యాట్రిక్ సాధ్యమేనా ?

చూడబోతే పరిస్దితులు అలాగే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. పెనుగొండలో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపిలు హోరా హోరీగా పోరాడాయి. రెండు పార్టీల బలాబలాలు చూస్తే కాగితంపైన లెక్కలేస్తే మాత్రం టిడిపి వైపు మొగ్గు కనబడుతోంది. మొన్నటి ఎన్నికలో టిడిపి తరపున బికె పార్ధసారధి రంగంలో దిగారు. టిడిపి ఆవర్భావం నుండి ఈ నియోజకవర్గంలో కంచుకోటలాగ మారిపోయింది. ఇప్పటి వరకూ జరిగిన 11 ఎన్నికల్లో టిడిపి తొమ్మిదిసార్లు గెలిచింది.

పోయిన ఎన్నికల్లో పార్ధసారధికి వ్యతిరేకంగా వైసిపి తరపున శంకరనారాయణ పోటీ చేశారు. మొన్నటి ఎన్నికల్లో కూడా పాత ప్రత్యర్ధులే మళ్ళీ ఢీ అంటే ఢీ అన్నారు. ఈ నియోజకవర్గంలో బిసిలదే పై చేయి. పోయిన ఎన్నికల వరకూ బిసిలు టిడిపితోనే ఉన్నారు కాబట్టే పార్ధసారధి ఏకంగా 17వేల ఓట్ల మెజారిటీతో వైసిపిపై గెలిచారు.

అయితే గడచిన ఐదేళ్ళల్లో పరిస్ధితులు మారిపోయాయి. చంద్రబాబునాయుడు పాలనపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతకు తోడు మొదటి నుండి టిడిపినే అంటిపెట్టుకుని ఉన్న బిసిలు దూరమయ్యారు. కాకపోతే పార్టీకున్న పట్టుకుతోడు వ్యక్తిగతంగా పార్ధసారధి కూడా ఆర్ధిక, అంగ బలాల్లో బాగా ఎదిగిపోయారు. ఆ విషయంలో వైసిపి అభ్యర్ధి శంకరనారాయణకు మైనస్ మార్కులే వస్తాయి.

అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, కొత్తగా వచ్చిన బిసిల మద్దతు, శంకరనారాయణ గడచిన ఐదేళ్ళుగా నియోజకవర్గంలోనే అందరితోను కలసిపోవటం లాంటివి కలసి వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి జగన్ కు మద్దతుగా జనాల్లో అండర్ కరెంట్ గనుక ఉంటే అది శంకరనారాయణను గెలుపు తీరాలకు చేరుస్తుందనటంలో సందేహం లేదు. ఏదేమైనా ఫైట్ మాత్రం మహారంజుగా జరిగిందనే చెప్పాలి.