‘నగిరి’లో రోజాకి వైసీపీ సీటు వుందా.? లేదా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నగిరి ఎమ్మెల్యే, మంత్రి రోజా వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకుంటారా.? లేదా.? ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు రోజా. అదీ నగిరి నియోజకవర్గం నుంచే.

అయితే, నగిరిలో రాజకీయం వేరేలా వుంది. నగిరి వైసీపీలో ఎవర్ని కదిలించినా, ‘రోజాకి టిక్కెట్ ఇవ్వొద్దు..’ అనే అంటున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ, స్థానిక ఎమ్మెల్యే మీద వైసీపీ శ్రేణుల్లో ఇంతటి వ్యతిరేకత లేదు. చిత్రంగా వైసీపీ అధినాయకత్వం కూడా, రోజాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నగిరి వైసీపీ నేతల్ని ప్రోత్సహిస్తుండడం గమనార్హం.

వచ్చే ఎన్నికల్లో రోజాకి వైసీపీ టిక్కెట్టు దక్కదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన పార్టీ వైపుగా రోజా సమాలోచనలు చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియాలో ఊహాగానాలూ జోరందుకున్నాయి.

మరోపక్క, వైసీపీ అనుకూల మీడియా కూడా, నగిరిలో రోజా పోటీ చేయకపోవచ్చంటూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి రోజా స్పందించారు. తాజాగా, ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ, నగిరి సీటు తనకే దక్కుతుందనీ, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే గెలుస్తాననీ చెప్పుకొచ్చారు.

ఒకవేళ నగిరి సీటు బీసీలకు ఇవ్వాలనుకుంటే.? అన్న ప్రశ్నకు స్పందించిన రోజా, ‘ఎవరికి సీటు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. జగన్ ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా కోరుకుంటున్నాను. పార్టీ మారే అవకాశమే లేదు’ అని తేల్చేశారు.

‘నేనే పోటీ చేస్తానని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. నేనెందుకు ఆందోళన చెందుతాను.? పార్టీ కార్యక్రమాల్లో నేనే ముందు వరుసలో వుంటాను. నగిరిలో చాలా అభివృద్ధి చేశాను..’ అని చెప్పారు రోజా.

అయితే, రోజా ఏం చెప్పినా ఇంకోసారి ఆమెకు టిక్కెట్ ఇవ్వడం కష్టమేనన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. ఎందుకిలా.?