కొడుకే తండ్రి కొంపముంచేట్లున్నాడు

చూడబోతే వ్యవహారం అలాగే అనిపిస్తోంది. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంట్లో మొదలైన ముసలం అసలుకే ఎసరు తెచ్చేలాగుంది. పోయిన ఎన్నికల్లోనే అయ్యన్న అతికష్టం మీద గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు ఇపుడు ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతకు తోడు ఇంట్లోనే కొడుకు రూపంలో పుట్టిన ముసలం బోనస్ గా తయారైంది. దాంతో వచ్చే ఎన్నికల్లో మంత్రి గెలుపుపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు తమ్ముడు మరోవైపు పెద్ద కొడుకు విజయ్ చింతకాయల పుట్టి ముంచేట్లే ఉన్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, చింతకాయల అయ్యన్నపాత్రుడి వ్యవహారాలు మొత్తం మొదటి నుండి తమ్ముడు సన్యాసిపాత్రుడే చూసుకునే వారు. అటువంటిది ఈమధ్యనే ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు విజయ్ నియోజకవర్గం మొత్తం చక్కబెట్టేస్తున్నారు. అదికూడా మంత్రికి తెలీకుండా సన్యానిపాత్రుడుకు చెప్పకుండానే. దాంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏవి ఎక్కడ జరుగుతున్నాయో కూడా సన్యాసికి తెలీటం లేదు. అంతుకుముందు సన్యాసికి తెలీకుండా ఒక్క కార్యక్రమం కూడా జరిగేది కాదు. అటువంటిది ఇపుడు ఒక్క కార్యక్రమానికి సంబంధించిన సమాచారం కూడా అందటం లేదు. దాంతో  సన్యాసికి మండిపోయింది.

 దానికితోడు వచ్చే ఎన్నికల్లో కొడుకు విజయ్ ను ఎన్నికల్లో నిలబెట్టాలని అయ్యన్న అనుకుంటున్నారు. ఆ విషయం తెలిసి తమ్ముడు సన్యాసికి ఒళ్ళు మండిపోయింది. అన్న తర్వాత తానే పోటీ చేయాలని సన్యాసి అనుకుంటున్నాడు. కానీ హఠాత్తుగా అయ్యన్న కొడుకు విజయ్ సీన్ లోకి వచ్చేటప్పటికి సన్యాసి తట్టుకోలేకపోతున్నారు. అయితే విజయ్ కేమో అసెంబ్లీ నియోజకవర్గం మీద కోరికలేదు. ఎంపిగా పోటీ చేయాలని కోరిక. ఒకవేళ అన్న అయ్యన్నపాత్రుడు పోటీనుండి తప్పుకుంటే తనకే టిక్కెట్టు ఇవ్వాలంటూ చంద్రబాబును కలిసి సన్యాసిపాత్రుడు రిక్వెస్ట్ చేశారు.

అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సన్యాసికి చెప్పకుండా విజయ్ చక్కబెట్టేస్తున్నారు. నియోజకవర్గంలో కీలకమైన పోస్టింగులు కూడా వేసేస్తున్నారు. దశాబ్దాల పాటు అయ్యన్న వ్యవహారాలను చక్కపెట్టిన సన్యాసితో పాటు ఆయన మద్దతుదారులకు విజయ్ వైఖరి ఏమాత్రం నచ్చలేదు. దాంతో నియోజకవర్గంలో పరిస్ధితిని కొందరు నేతలు చంద్రబాబుకు లేఖరూపంలో చెప్పేశారు. దాంతో ఇంతకాలం మంత్రి ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్ని గొడవలు జరుగుతున్నా అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అంటే ఉంటున్నది ఒకే ఇంట్లోనే అయినా సన్యాసి, విజయ్ మధ్య మాటలు లేవట.

విజయ్ వైఖరిపై నియోజకవర్గంలో నేతలంతా మండిపోతున్నారు. అయ్యన్న పోటీ నుండి తప్పుకుంటే టిక్కెట్టు సన్యాసికే ఇవ్వాలంటూ ఓ తీర్మానం కూడా చేశారు. ఆ విషయం తెలియటంతో విజయ్ కూడా బాబాయ్ మీద మండిపడుతున్నారు. అంటే అయ్యన్న ఇంట్లో పుట్టిన ముసలం రేపటి ఎన్నికల్లో చివరకు అయ్యన్నను ముంచేట్లే కనబడుతోంది. పోయిన ఎన్నికల్లోనే మంత్రి వైసిపి అభ్యర్ధి  పెట్ల ఉమాశంక్ గణేష్ పై అతికష్టం మీద 2600 ఓట్లతో గెలిచారు. తాజాగా మొదలైన ముసలం గనుక మరింత పెరిగిపోతే వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు గెలిచేది కల్లే.