ఆంధ్రాలో మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్న నేతలు వీరే…

గత కొంత కాలంగా కామ్ గా ఉన్న మావోలు కిడారి, సివేరి హత్యతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలవరం రేకెత్తించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు చుట్టు పక్క రాష్ట్రాల్లో కూడా మావోలపై కన్నేసి ఉంచారు పోలీసు అధికారులు. భద్రతను కట్టుదిట్టం చేసారు.

డుంబ్రిగుడ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు మావోల తదుపరి టార్గెట్ పై చర్చలు జరుపుతున్నారు. అధికారుల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ దీనిపై విస్తృతంగా చర్చలు కొనసాగుతున్నాయి. మావోల హిట్ లిస్ట్ లో మొత్తం 200 మంది ఉన్నట్టు టాక్ నడుస్తోంది. వీరిలో ప్రజాప్రతినిధులు, మాజీలు, పలు పార్టీల నేతలు, పోలీసులు, మిలిషియాలో పని చేసి లొంగిపోయిన యువకులు, పోలీస్ ఇన్ఫార్మర్లుగా భావిస్తున్న గిరిజనులు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను తమకు ముందస్తు సమాచారం అందించకుండా ఎక్కడికీ వెళ్ళకూడదు అని పోలీసులు హెచ్చరించినట్టు సమాచారం. నక్సల్స్ హిట్ లిస్ట్ లో విశాఖకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మంత్రి అయ్యన్న పాత్రుడు                               పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

అయ్యన్న పాత్రుడితో పాటు ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్, గిడ్డి ఈశ్వరి వ్యక్తిగత కార్యదర్శి పాలపర్తి గోవిందరావు, బీజేపీ నాయకుడు లోకుల గాంధీ, కొయ్యురు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్ సూరిబాబు, టీడీపీ నాయకుడు ఎం.ప్రసాద్, పెదబయలు మండల అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, జామిగూడ మాజీ సర్పంచ్ సుబ్బారావు, ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరాలకు నక్సల్స్ నుండి ప్రమాదం పొంచి ఉన్నట్టు అధికారుల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జికె వీధి మండలంలో 8 మందికి, చింతపల్లి మండలంలో 12 మందికి పలుమార్లు మావోలు హెచ్చరికలు జారీ చేసినట్టు, ఏజెన్సీలో పలు మండలాలకు చెందిన 110 మంది మావోల హిట్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే అయ్యన్నపాత్రుడికి, గిడ్డి ఈశ్వరికి భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు అధికారులు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా గన్ మెన్ ను కేటాయించాలని నిర్ణయానికి వచ్చారు. అంతే కాకుండా మఫ్టీలో ఉండి పరిసరాల పరిస్థితులను గమనించే షాడో టీమ్ ను సిద్ధం చేశారు. ఈ మేరకు అయ్యన్నపాత్రుడికి ఇప్పటికే బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని అయ్యన్నకు, గిడ్డి ఈశ్వరికి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.