ఫిరాయింపు ఎంఎల్ఏకి  టిక్కెట్టు గల్లంతేనా ?

వచ్చే ఎన్నికల్లో చాలామంది ఫిరాయింపు ఎంఎల్ఏలకు మొండి చెయ్యి తప్పేట్లు లేదు. అందులో విశాఖపట్నం జిల్లాలో పాడేరు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి పేరు తాజాగా వినిపిస్తోంది. మొన్నటి వరకూ గెలుపోటములతో సంబంధం లేకుండా ఆమెకు టిక్కెట్టు వరకూ ఢోకా లేదనే అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలను  గమనిస్తుంటే గిడ్డికి అసలు టిక్కెట్టే దక్కే అవకాశాలు లేవని అర్ధమవుతోంది. టిక్కెట్టు గల్లంతకు కారణాలేమిటంటే, కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవటమే అని చెబుతున్నారు.

 

మామూలుగానే అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములపై చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లంటూ ఇఫ్పటికే చంద్రబాబు చాలాసార్లే స్పష్టం చేసిన చేశారు. సర్వే నివేదికల ఆధారంగా పలువురు ఫిరాయింపు ఎంఎల్ఏల్లో చాలామంది టిక్కెట్లు దక్కవని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా  కాంగ్రెస్ తో కుదిరిన పొత్తుల కారణంగా మరికొందరు ఫిరాయింపులకు టిక్కెట్లు గల్లంతవ్వటం ఖాయంగా చెబుతున్నారు.

 

అందులో ప్రధానంగా గిడ్డి ఈశ్వరి పేరు బయటకు వచ్చింది. కారణం ఏమిటంటే, కాంగ్రెస్ తరపున పాడేరు నియోజకవర్గంలో పోటీ చేయటానికి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బాలరాజుకు నియోజకవర్గంలో గట్టిపట్టుంది. గిరిజనుల్లో మంచి పేరుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్, టిడిపిల మధ్య పొత్తు కుదరటంతో బాలరాజులో మరింత జోష్ కనబడుతోంది. రేపటి ఎన్నికల్లో టిడిపి మద్దతుతో తన గెలుపు ఖాయమని పసుపులేటి గట్టిగా నమ్ముతున్నారు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కు 25 అసెంబ్లీ, 5 పార్లమెంటు సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరించారని ప్రచారం ఊపందుకుంది.

 

గిడ్డి కూడా కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ ఫిరాయించారని, మంత్రి పదవి ఇస్తానంటేనే పార్టీ మారినట్లు స్వయంగా గిడ్డే చెప్పిన వీడియో అప్పట్లో సంచలనం రేపింది. దానికితోడు తనతో పాటు గిడ్డి కూడా కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ మారినట్లు హత్యకు గురయ్యే ముందు స్వయంగా హత్యకు గురైన అరకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు చెప్పినట్లు మావోయిస్టులు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇఫ్పటికే కర్నూలు ఎంపి బుట్టా రేణుకకు షాక్ తప్పదని ప్రచారం జరుగుతోంది. కాబట్టి ముందుముందు ఇంకెంతమంది ఫిరాయింపులకు షాక్ తగులుతుందో చూడాల్సిందే.