జనసేన పార్టీలోకి జూనియర్ ఎన్టీయార్‌ని ఆహ్వానిస్తున్నారహో.!

Jr NTR

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ మధ్య సన్నిహిత సంబంధాలే వున్నాయి. గతంలో ఎన్టీయార్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కలయికకి కారణం కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ – ఎన్టీయార్ మధ్య ఆ సందర్భంలో పలు అంశాలపై చర్చ కూడా జరిగింది. సినిమా వ్యవహారాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నారు.

ఇక, మెగా కుటుంబంతో యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి వున్న బాండింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బంధాన్ని యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని అభిమానించే కొందరు అభిమానులు చాలాకాలంగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా మెగా కాంపౌండ్ నుంచి ఎన్టీయార్‌ని దూరంగా లాగాలనే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

మెగా కాంపౌండ్ నుంచి ఏదన్నా సినిమా వస్తే చాలు, ఎన్టీయార్‌ని అభిమానించే ఆ సోకాల్డ్ నందమూరి అభిమానులు, ఎన్టీయార్ ముసుగేసుకుని.. తీవ్రస్థాయిలో నెగెటివిటీ ప్రచారం చేస్తుంటారు. తద్వారా మెగా అభిమానుల్ని వాళ్ళు రెచ్చగొడుతుంటారు. మెగాభిమానులు యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమాల్ని ట్రోల్ చేయడానికి కారణం కూడా అదే.

అదంతా గతం.! ఇప్పుడు సీన్ మారుతోంది. నందమూరి అభిమానుల్లో ఎన్టీయార్ అభిమానులు ఇప్పుడు వేరుపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుణ్యమా అని హెల్త్ యూనివర్సిటీ వివాదం దెబ్బకి జూనియర్ ఎన్టీయార్‌ని ఎవరు అభిమానిస్తారు.? అభిమానం ముసుగులో ఎవరు వెన్నుపోటు పొడుస్తారనేది తేలిపోయింది. దాంతో, నిఖార్సయిన ఎన్టీయార్ అభిమానులు.. టీడీపీతో బంధం తెంచేసుకుంటున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే, జనసైనికులు.. యంగ్ టైగర్ ఎన్టీయార్ జనసేన పార్టీకి మద్దతు తెలిపితే బావుంటుందని సూచిస్తున్నారు. ఈ సూచన పట్ల ఎన్టీయార్ అభిమానులు కూడా కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మరి, ఎన్టీయార్ రాజకీయ నిర్ణయం తీసుకుని, జనసేన పార్టీకి మద్దతిస్తారా.? వేచి చూడాల్సిందే.