భరత్ కు జేడి గండం ?

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ పరిస్ధితిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. మొన్నటి వరకూ భరత్ గురించి  బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలీదు.  కానీ బాలకృష్ణ చిన్న కూతురుని వివాహం చేసుకోవటం, విశాఖపట్నం ఎంపి సీటుకు ప్రయత్నం మొదలుపెట్టటంతో రాజకీయంగా కూడా వెలుగులోకి వచ్చారు. ఎంపి సీటు విషయంలో భరత్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. కానీ చివరి అస్త్రంగా మావగారు బాలకృష్ణను రంగంలోకి దింపటంతో బరత్ కు టికెట్ ఇవ్వక తప్పలేదు చంద్రబాబునాయుడుకు.

సరే ఇక భరత్ గెలుపోటములపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశంపార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో భరత్ పోటీ చేయటం ఎంత వరకూ ఉపయోగమో వాళ్ళకే తెలియాలి.  ఎందుకంటే, నేరుగా ఎంపి అభ్యర్ధిని చూసే ఓట్లేసే రోజులు పోయాయి. ఎంఎల్ఏ అభ్యర్ధుల బలం మీదే ఎంపి గెలుపు ఎక్కువగా ఆధారపడుంటుందన్న విషయం అందిరికీ తెలిసిందే.

దానిప్రకారమైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎల్ఏ అభ్యర్ధుల్లో చాలామందిపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. దానికితోడు వివిధ కారణాలతో ఎంఎల్ఏ అభ్యర్ధుల్లో ఎక్కువమంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దాంతో ఎంఎల్ఏల గెలుపే అనుమానంగా మారింది.

అసెంబ్లీ అభ్యర్ధుల పరిస్ధితే ఇలాగుంటే భరత్ కు పోటీగా వైసిపి, జనసేన అభ్యర్ధులు కూడా రంగంలో ఉన్నారు. వైసిపి తరపున బిల్డర్ ఎంవివి సత్యనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసిపి వేవ్ ఉంటే సత్యనారాయణ గెలుపు ఈజీనే. మరి జేడి లక్ష్మీనారాయణ పరిస్ధితేంటి. ఏమిటంటే, జేడి అంటే మధ్య తరగతి కుటుంబాల్లో బాగా సానుకూలత కనబడుతోంది.  అంటే జేడికి పడే ప్రతీ ఓటు టిడిపి నష్టమే అనుకోవాలి. ఈ లెక్కన జేడికి ఎన్ని ఎక్కువ ఓట్లు పడితే భరత్ కు అంతనష్టం. మరి ఈ విషయం మామా అల్లుళ్ళకు తెలీకుండానే ఉంటుందా ?