హత్యాయత్నం ఘటన: చంద్రబాబుకు హై కోర్టు షాక్ తప్పదా ?

జగన్ పై హత్యాయత్నం కేసు విచారణలో చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని డ్రామాగా చంద్రబాబు కొట్టిపాడేశారు. సానుభూతి కోసం, ప్రచారం కోసం తన అభిమానితో తనపై తానే జగన్ దాడి చేయించుకున్నాడంటూ చంద్రబాబు ఎగతాళి మాట్లాడటం అందరికీ గుర్తుండే ఉంటుంది. జరిగింది హత్యాయత్నమేనంటూ జగన్ అండ్ కో ఎంత మొత్తుకున్నా చంద్రబాబు ఏమాత్రం ఖాతరు చేయలేదు. పైగా ఘటన జరిగిన గంట నుండే డిజిపి, మంత్రులు, చంద్రబాబు వైసిపిపై చేసిన ఎదురుదాడిని ఎవరైనా ఎలా మరచిపోతారు ?

అందుకే హత్యాయత్నం కుట్ర వెనుక దాగున్న వాస్తవాలను బయటకు తీయాలంటూ థర్డ్ పార్టీ విచారణ కానీ లేకపోతే జ్యుడీషియల్ విచారణను కానీ జగన్, వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. హత్యాయత్నం ఘటన జరిగింది కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో. సిబిఐ విచారణ చేయించటానికి నిజానికి కేంద్రానికి పూర్తి స్వేచ్చ ఉంది. అయినా ఎందుచేతనో కేంద్రం స్పందించటం లేదు. సిఐఎస్ఎఫ్ విచారణలో కూడా జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని తేలినా కేంద్రం నోరిప్పటం లేదు.

అందుకనే జగన్ తో పాటు వైసిపి మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి కూడా హై కోర్టులో కేసు దాఖలు చేశారు. నాలుగు రోజులుగా కేసును విచారిస్తున్న కోర్టు సిట్ విచారణ నివేదికను సీల్డ్ కవర్లో తమకు వచ్చే మంగళవారంలోగా అందించాలని ఆదేశించింది. దాంతో చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే. ఎందుకంటే, హత్యాయత్నం ఘటనను ఘటనగా చూడకుండా రాజకీయం కోణంలో మాత్రమే చంద్రబాబు చూశారు. అందుకనే జగన్ అండ్ కో డిమాండ్ ను ఏమాత్రం లెక్క చేయలేదు.

అదే సమయంలో సిట్ విచారణ కూడా ఎఫెక్టివ్ గా జరగలేదన్నది వాస్తవం. కుట్ర కోణంలో కాకుండా నిందితుడు శ్రీనివాస్ ఎన్ని మొబైల్ ఫోన్లు మార్చారు, ఎన్ని వేల ఫోన్ కాల్స్ మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు ? లాంటి అంశాలకే సిట్ విచారణ పరిమతమైంది. అదే విషయాన్ని జగన్ తన పిటీషన్లో పేర్కొన్నారు. సిట్ నివేదికను పరిశీలించిన తర్వాత హైకోర్టు గనుక జగన్ వాదనతో ఏకీభవిస్తే చంద్రబాబుకు షాక్ తగలటం ఖాయం. జగన్ పై జరిగింది హత్యాయత్నమే అంటూ కోర్టు కూడా ఏకీభవించినట్లవుతుంది. అప్పుడు క్యాంటిన్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరితో పాటు అందరూ విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చు. దాంతో హత్యాయత్నం ఘటన రేపటి ఎన్నికల్లో చంద్రబాబు కొంపముంచే అవకాశం కూడా ఉంది.