మంత్రి దాడి శెట్టి రాజా.. పవన్‌పై విమర్శలతో అధినేత మెప్పు పొందగలరా.?

కన్నబాబు ఎక్కడ.? కొడాలి నాని పరిస్థితేంటి.? పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్ తదితరులు ఏమయ్యారు.? వాళ్ళందరి గురించీ ఒక్కసారి ఆలోచిస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి బహుశా మంత్రి దాడిశెట్టి రాజా ఒకటికి పదిసార్లు ఆలోచించి వుండేవారేమో.

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే కావొచ్చు. కానీ, ‘కామ పిశాచి..’ అనడమేంటి.? పవన్ కళ్యాణ్ మీద ఈ స్థాయిలో దూషణలకు దిగడం వల్ల వైసీపీకి కలిగే లాభమేంటి.? ప్రజలకు ఒరిగేదేంటి.? రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏవో ప్రశ్నలు ప్రభుత్వంపై వేశారు, వాటికి ప్రభుత్వం సమాధానం చెబితే చెప్పొచ్చు.. లేదంటే మానెయ్యొచ్చు.

పవన్ కళ్యాణ్‌ని చూసి, ఆడ పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తపడుతున్నారంటూ దాడిశెట్టి రాజా.. వ్యాఖ్యానించడం జుగుప్సాకరమే. తన వద్ద డ్రైవరుగా పనిచేసిన వ్యక్తిని చంపేసి, ఇంటికి డెడ్ బాడీని పార్సిల్ చేసిన ఎమ్మెల్సీ తమ పార్టీకి చెందినవాడేనని మంత్రిగారు మర్చిపోతే ఎలాగన్నది జనసేన పార్టీ నుంచి వస్తోన్న ప్రశ్న.

అంతేకాదు, ‘మేం అధికారంలోకి వస్తే, గుడ్డలు విప్పి జైల్లో కూర్చోబెడతాం..’ అని జనసేన నేతలతో అనిపించుకునే స్థాయికి దాడిశెట్టి రాజా ఎందుకు దిగజారిపోయినట్లు.? ఇలాంటి చర్యలతో దాడిశెట్టి రాజా కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు.. అధినేత వైఎస్ జగన్ మెప్పుని మాత్రం పొందలేరు. దానికి పైన చెప్పుకున్న నేతల వ్యవహారమే ఉదాహరణ.

నానాటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. తిలా పాపం తలా పిడికెడు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఏ పార్టీ ఇందుకు మినహాయింపు కాదు. చూస్తోంటే, అసలెవరికీ ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యత వున్నట్లు కనిపించడంలేదు.