జగన్ నిర్ణయాన్ని కేంద్రం అంగీకరిస్తుందా ?

జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు చెబుతున్న రివర్స్ టెండరింగ్ విధానంపై కేంద్రప్రభుత్వ వైఖరి ఏంటో ఈరోజు తేలిపోతుంది. ఇదే విషయమై నిర్ణయం తీసుకునేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటి (పిపిఏ) సమావేశమవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ పద్దతిలో చేపట్టాలని జగన్ నిర్ణయించారు. పోలవరంలో సుమారు రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని నిపుణుల కమిటి నివేదికలో నిర్ధారించింది. అవినీతిని నియంత్రించటంతో పాటు తక్కువ ధరలకే పనులు చేయించాలన్నది జగన్ ఆలోచన.

అందుకనే పోలవరం పనులతో పాటు బందరు పోర్టు పనులను కూడా నిలిపేసింది. మొన్నటి వరకూ రెండు పనులను నవయుగ కంపెనీయే చేస్తోంది. అయితే పోలవరం గేట్లను మాత్రం బెకెమ్ కంపెనీ చేస్తోంది. జగన్ నిర్ణయం వల్ల మొత్తం మూడు పనులు నిలిచిపోయాయి. నిజానికి పోలవరం పనులకు నిధులు ఇస్తోంది కేంద్రప్రభుత్వం. కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కేంద్రం ఆమోదం తప్పనిసరి.

అయితే ఇక్కడ కేంద్రంతో కానీ పిపిఏతో కానీ సంబంధం లేకుండా రివర్స్ టెండరింగ్ విధానంపై జగనే నిర్ణయం తీసేసుకన్నారు. తర్వాత తన చర్యను సమర్ధించుకుంటూ ఆమోదం కోసం కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖపై నిర్ణయం తీసుకునేందుకే పిపిఏ ఈరోజు సమావేశమవుతోంది. నవయుగ కంపెనీ పనులను ఆపేసిన రోజే జగన్ నిర్ణయంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇక్కడ రెండు అంశాలున్నాయి. మొదటిది ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నది మొదటిది.  ప్రాజెక్టు పనులు బాగా ఆలస్యమవుతోందన్నది రెండోది. పై రెండు అంశాలను  ప్రధానమంత్రి నరేంద్రమోడితో సహా బిజెపి నేతలందరూ అంగీకరించారు. కాబట్టి జగన్ చర్యలకు కాస్త నైతికంగా బలమొచ్చింది. కాకపోతే రాజకీయ అజెండాతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఆసక్తిగా మారింది. చూడాలి పిపిఏ ఏం నిర్ణయిస్తుందో.