ఈ నలుగురి చేరికతో బిజెపి బలపడుతుందా ?

తెలుగుదేశంపార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులను లాక్కున్నంత మాత్రాన బిజెపి బలపడుతుందా ? ఇపుడిదే చర్చ విస్తృతంగా మొదలైంది. టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ బిజెపి కండువా కప్పుకున్నారు. అంటే టిడిపికి మిగిలింది ఇద్దరు సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్ర మాత్రమే.

ఇక బిజెపిలో చేరిన ఎంపిల విషయం చూద్దాం. నలుగురు ఎంపిల్లో సుజనా, సిఎం రమేష్, గరికపాటి మొదటి నుండి కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమే. వీళ్ళెవరకి ఏరోజు జనాలతో నేరుగా సంబంధాలు లేవు. వీళ్ళు పోటీ చేస్తే జనాలు ఓట్లేస్తారో లేదో కూడా అనుమానమే. ఒక్క టిజి వెంకటేష్ మాత్రమే గతంలో ఎంఎల్ఏగా గెలిచారు.

మరి ఈ విషయం బిజెపికి తెలీకుండానే ఉంటుందా ?  తెలిసి కూడా వీళ్ళని ఎందుకు తీసుకుంది ? ఎందుకంటే నలుగురు కూడా ఆర్ధికంగా మంచి స్ధితిమంతులే. పైగా సుజనా, సిఎం రమేష్ ల అవినీతి సంపాదనపై టిడిపిలోనే మండిపడిన నేతలు చాలామందే ఉన్నారు. బ్యాంకులను ముంచి వేల కోట్లు సంపాదించటంలో, ప్రాజెక్టుల అంచనాలను పెంచేసి వందల కోట్లు సంపాదించటంలో సుజనా, రమేష్ బాగా ఆరితేరిపోయారు.

అందుకనే వారిపై సిబిఐ దాడులు చేసి విచారణ చేస్తోంది. ఈ నేపధ్యంలోనే వీరు బిజెపిలో చేరటం విచిత్రంగా ఉంది.  బిజెపిలో చేరిన ఎంపిల్లో ముగ్గురి వల్ల అవసరానికి డబ్బులు సర్దుబాటు అవుతాయేమో కానీ నాలుగు ఓట్లు పడే అవకాశాలైతే లేవన్నది వాస్తవం. కాకపోతే బిజెపికి రాజ్యసభలో బలం లేదు కాబట్టి అక్కడ ఓటింగ్ సమయంలో ఉపయోగపడతారంతే.