భూమా కుంటుంబం పరిస్ధితి ఏమిటి ?

జిల్లాలో ఇదే విషయమై తీవ్రమైన చర్చ జరుగుతోంది. జిల్లాలో భూమా ఫ్యామిలీకి రాజకీయంగా  మంచి పట్టుంది. మొన్నటి ఎన్నికల్లో నంద్యాలలో భూమా బ్రహ్మానండరెడ్డి, ఆళ్ళగడ్డలో ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ పోటీ చేశారు. అఖిలప్రియ తల్లి, దండ్రుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు లేండి. అయితే పెద్దవాళ్ళకున్న పట్టు వారసులకు లేదన్నది మాత్రం వాస్తవం. పోలింగ్ తర్వాత అనేక విశ్లేషణలు వస్తున్నాయి భూమా కుంటుంబం గెలుపోటములపై.

పోలింగ్ సరళిని గమినస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. అదేమిటంటే పై రెండు నియోజకవర్గాల్లో భూమా శతృవులంతా ఏకమయ్యారని. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూక్ తో పాటు చిన్నా చితకా లీడర్లు కూడా భూమా కుటుంబానికి వ్యతిరేకమే చేశారట.  సీనియర్ నేతలు భూమా కుటుంబానికి వ్యతిరేకం చేయటమంటే మంత్రి స్వయంకృతమనే చెప్పుకోవాలి.

ఫిరాయింపు మంత్రి నోటి దురుసు, సీనియర్లను గౌరవించలేకపోవటం, గొడవలు పెట్టుకోవటం లాంటి కారణాలతో అందరూ దూరమయ్యారు.  అదే సమయంలో  ఇద్దరికీ చివరి నిముషం వరకూ చంద్రబాబునాయుడు టికెట్లు ఖరారు చేయలేదు. నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేయటానికి రెడీ అయిన తర్వాత కానీ చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు.

అదే సమయంలో వైసిపి అభ్యర్ధులుగా పోటీ చేసిన గంగుల బిజేంద్రనాధరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి రెండేళ్ళుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు వైసిపి నేతలు ఎలాగైనా రెండు సీట్లలో గెలవాలన్న కసితో పనిచేశారు.  అంటే భూమా కుటుంబానికి బయటనుండే కాక పార్టీలో అంతర్గతంగా కూడా దెబ్బ పడినట్లే అనిపిస్తోంది. దాంతో రెండు సీట్లలో అక్కా తమ్ముళ్ళు ఓడిపోయేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.