తెలంగాణకు ఆ ఐదు గ్రామాల్నీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తుందా.?

ఆంధ్రప్రదేశ్ అస్సలేమాత్రం తేలిగ్గా తీసుకోకూడని విషయమిది. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో వున్న ఐదు గ్రామ పంచాయితీలు, తాము ఆంధ్రప్రదేశ్‌లో వుండబోమనీ, తెలంగాణలో తాము కలిసిపోతామనీ తీర్మానం చేయడా చాలా చాలా సీరియస్ అంశం. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంగా పేర్కొంటూ ఏడు మండలాల్ని అప్పటి ఖమ్మం జిల్లా నుంచి వేరు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. ఆ ప్రాంతంలోని ఐదు గ్రామాలు ఇప్పుడు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుండబోమనీ, తాము తెలంగాణలో కలుస్తామనీ నినదిస్తున్నాయి.

పంచాయితీ తీర్మానాలు, ప్రజలు రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు వెరసి, రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిజానికి, భద్రాచలం రెవెన్యూ డివిజన్ మొత్తం ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగం. పరిపాలనా సౌలభ్యం కోసం, అప్పట్లో ఖమ్మం జిల్లాలో కలిసింది ఆ ప్రాంతం. ఆ తర్వాత అది తెలంగాణ భూభాగమైపోయింది.

నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో భద్రాచలం కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోవాల్సింది. కానీ, అలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కోల్పోవడమే తప్ప, తనను తాను సంతృప్తి పరచుకోలేని పరిస్థితి. ఎందుకిలా జరుగుతోంది.? అంటే, దానికి బోల్డన్ని కారణాలున్నాయి.

గతం గతః ఇప్పుడు ఆ ఐదు గ్రామాల్ని ఏపీ వదులుకుంటే, ఏడు మండలాల్లో మళ్ళీ రచ్చ మొదలయ్యే ప్రమాదం లేకపోలేదు.