అన్నా క్యాంటీన్లపై వైసీపీ ఎందుకిలా చేస్తోంది.?

Anna Canteen

సలహాదారులు సరైన సూచనలు చేయడంలేదా.? లేదంటే, అధినాయకత్వమే ఒకింత మొండిగా ఆలోచిస్తోందా.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతోన్న చర్చ ఇది. కింది స్థాయిలో జరుగుతున్న ఈ చర్చ, పై స్థాయి వరకూ వెళ్ళడంలేదు. అన్నా క్యాంటీన్ల విషయంలో వైసీపీ అధినాయకత్వం తప్పుడు వ్యూహాలతో ముందుకు వెళుతోందన్న అభిప్రాయం వైసీపీలోనే వ్యక్తమవుతోంది.

సంక్షేమ పథకాల విషయంలో పేర్లు మారుతుంటాయ్, రంగులు మారుతుంటాయ్. చాలా అరుదుగా ఆయా సంక్షేమ పథకాలు రద్దవుతుంటాయ్ పాలకులు మారినప్పుడల్లా. అన్నా క్యాంటీన్ విషయంలో రెండోది జరుగుతోంది. ఇది పేదలకు పట్టెడన్నం తక్కువ ధరకు అందించే కార్యక్రమం.

ఆకలితో వున్నవాడి కడుపు నింపే కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వమైనా రద్దు చేయకూడదు. కానీ, వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అన్నా క్యాంటీన్ల పేరుతో చంద్రబాబు సర్కారు అక్రమాలకు పాల్పడి వుంటే, వాటిని సరిదిద్ది.. తమ హయాంలో రంగులు మార్చేసి, పేరు కూడా మార్చేసుకోవచ్చు.. కానీ, వైసీపీ సర్కారు అలా చేయడంలేదు. పేదలకు అన్నం పెట్టే కార్యక్రమానికి మంగళం పాడేసింది.

మొదట్లో ఇది జస్ట్ రాజకీయ విమర్శగానే వుండేది. కానీ, ఇప్పుడది వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లను మొబైల్ వాహనాల ద్వారా, ఇతరత్రా రూపాల్లో జనం వద్దకు తీసుకెళుతోంది. ఆకలితో వున్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది కూడా.!

రుచికరమైన ఆహారం అనే కాదు, ఆకలితో వున్నప్పుడు ఎలాంటి ఆహారమైనా కడుపులోకి వెళితే.. అది పెట్టినవారిని గుర్తుపెట్టుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. అదే కంచం దగ్గర కూడుని కాలితో తన్నితే, విషయం వేరేలా వుంటుంది. వైసీపీ రెండోదే చేస్తోంది.

వైఎస్సార్ క్యాంటీన్ అనో, జగనన్న క్యాంటీన్ అనో.. వైసీపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంటే, అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అంతే తప్ప, క్యాంటీన్లపై రాజకీయ దాడులు, ట్రాఫిక్ ఇబ్బందుల పేరు చెప్పి పోలీసుల దాడులు జరుగుతోంటే.. అస్సలేమాత్రం సమర్థనీయం కాదిది.