బెదురుతోన్న వైసీపీ.! అవసరమా ఇదంతా.?

‘వైనాట్ 175’ అనే ధీమా వున్నప్పుడు, రాజకీయ ప్రత్యర్థులెలా వ్యూహాలు రచిస్తే ఏంటి.? ఇలా కదా, అధికార వైసీపీ ఆలోచించుకోవాలి.? ‘ప్రజలు మాతోనే వున్నారు.. 85 శాతం కుటుంబాలు వైసీపీతోనే వున్నాయి..’ అని చెబుతున్నప్పుడు, టీడీపీ – జనసేన కలిస్తే, వైసీపీకి వచ్చిన నష్టమేంటి.?

కానీ, వైసీపీ ఆందోళన చెందుతోంది. రజనీకాంత్ మీద నానా యాగీ చేశారు వైసీపీ నేతలు, ఆ రజనీకాంత్, చంద్రబాబుని పొగిడారన్న కారణంగా. ఇదేం పిచ్చి.? అని వైసీపీలోనే చాలామంది తమ పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న వైనం కనిపిస్తోంది.

విపక్షాలు బలపడేది, అధికార పార్టీలో మేకపోతు గాంభీర్యం బయటపడిపోయినప్పుడే.! వైసీపీలో ఇదే జరుగుతోంది. గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడూ అదే జరిగింది కూడా.! టీడీపీ వైఫల్యాల నుంచి వైసీపీ పాఠాలు నేర్చుకోలేదు.

పాలన పరంగా తమకు ఫుల్ మార్క్స్ అని చెప్పుకుంటున్న వైసీపీ, 2024 ఎన్నికలపై విశ్వాసం ఎందుకు కోల్పోతున్నట్టు.? ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సింది పోయి, భయమెందుకు వస్తోంది.?

రాజకీయాల్లో విమర్శలు మామూలే.! చంద్రబాబు – పవన్ కలయిక మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు. రజనీకాంత్, చంద్రబాబు మీద పొగడ్తలు చేయడాన్నీ ప్రశ్నించొచ్చు. కానీ, మంత్రులు రంగంలోకి దిగాల్సిన అవసరం వుందా.?

బెదురుతున్న వైసీపీకి నిదర్శనం ఇది.. అని ఆఫ్ ది రికార్డుగా వైసీపీ నేతలే మీడియాకి లీకులిస్తున్నారు. ‘ఇక ఇక్కడ కష్టం..’ అంటూ బయటపడేందుకూ ప్రయత్నిస్తుండడం గమనార్హం.