ఆ ‘తిట్టు’కి మరీ అంత పబ్లిసిటీ అవసరమా.?

Bosidike
Bosidike

Bosidike – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నేత కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ చేసిన దూషణల అనంతరం వైసీపీ – టీడీపీ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద వైసీపీ దాడికి ఆ దూషణల పర్వం కారణమైందంటే అతిశయోక్తి కాదేమో.

తమ పార్టీనే ఆ దాడి చేసినట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి అంగీకరించాల్సి రావడం అత్యంత శోచనీయమైన అంశం. హద్దులు దాటి చేసే రాజకీయ విమర్శలు, దూషణలు ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తాయనడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

దాడుల్ని ఎవరూ సమర్థించరు.. అలాగని దూషణల్ని సైతం క్షమించడానికి వీల్లేదు. శిక్ష చట్ట ప్రకారం పడాలి తప్ప, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారముండకూడదు.

ఇదిలా వుంటే, వైసీపీ శ్రేణులు.. పట్టాభి తిట్టిన తిట్టు విషయమై అనవసర ప్రచారానికి తెరలేపారు సోషల్ మీడియా వేదికగా. ‘పట్టాభి తిట్టిన తిట్టుకి అర్థం ఇదీ..’ అంటూ ట్విట్టర్, పేస్ బుక్ వేదికగా.. ప్రచారం చేస్తున్నారు. ‘ఇదే తిట్టు, మీ ఇంట్లోవారిని ఎవరైనా తిడితే, గాజులు తొడుక్కుని కూర్చుంటారా.?’ అన్నది వైసీపీ మద్దతుదారుల సూటి ప్రశ్న.

రాజకీయాల్లో విలువలెప్పుడో దిగజారిపోయాయ్. వైసీపీ నేతలు చాలామంది ఇంతకంటే దారుణంగా టీడీపీ అధినేత చంద్రబాబునీ, నారా లోకేష్‌నీ విమర్శించిన సందర్భాలున్నాయి. అలాగని ఆ సంఘటనల్లో అధికార పార్టీకి చెందిన కార్యాలయాలపై దాడులు జరిగాయా.?

అయ్యిందేదో అయిపోయింది.. ఈ ఘటనకు సంబంధించి ఇరువురూ హుందాగా పరస్పరం క్షమాపణలు చెప్పేసుకుంటే వివాదం సద్దుమణిగిపోతుంది. అంతే తప్ప, రోడ్డెక్కి కొట్టుకోవడాలు.. సోషల్ మీడియా వేదికగా తిట్లకు అర్థాలు వెతుక్కుంటూ పోతే.. అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?