అనంతరపురం జిల్లా రాజకీయాలు గత కొన్నిరోజులుగా ఉద్రిక్తంగా ఉన్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల నడుమ చోటు చేయూసుకుంటున్న పరిణామాలు ఎప్పుడు ఏ గొడవకు దారితీస్తాయో తెలియట్లేదు. ప్రధానంగా జేసీ సోదరుల కేంద్రంగా ఈ రాద్ధాంతాలు నడుస్తున్నాయి. అధికారం కోల్పోవడంతో జేసీ సోదరులు ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు సైలెంట్ అయిపోయారు. నిన్నమొన్నటివరకు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ ఇద్దరు సోదరులు ఇప్పుడు మాత్రం ప్రత్యర్థులకు ఈజీగా టార్గెట్ అవుతున్నారు. కొన్ని నెలల క్రితం ఫోర్జరీ డాక్యుమెంట్లతో బస్సులు తిప్పారనే ఆరోపణలతో జేసీ దివాకర్ రెడ్డి అయన కుమారుడు అరెస్ట్ అయ్యారు. చాలా రోజులపాటు ఇద్దరూ జైల్లో గడిపారు. ఇప్పుడు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మందీ మార్భలంతో వెళ్లి హల్చల్ చేశారు.
ఈ విషయమై అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఒక్కరు కూడ నోరు తెరవట్లేదు. ఇంతకుముందు జేసీ అంటే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అంతెత్తున లేచేవారు. విషయం ఏదైనా జేసీ సోదరులదే తప్పన్నట్టు మాట్లాడేవారు. జేసీతో రేగిన వివాదం మూలంగానే మాధవ్ పోలీస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. అప్పటి నుండి ఆయన తరచూ టీడీపీకి చెందిన కుటుంబాల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే పరిటాల రవిని గురించి ఆయన మాట్లాడిన మాటలు పెను దుమారాన్ని రేపాయి. అక్కడే పేద గొడవైపోతుందని అనుకున్నారు అందరూ. రవి అనంతపురంలో నెత్తుటేర్లు పారించి పొలాలను తడిపారని, ఫ్యాక్షన్ ముసుగులో ఎంతోమంది తలలు తీశారని మాట్లాడారు.
సందర్భం లేకుండానే పరిటాల కుటుంబం మీద తప్పులెంచిన ఆయన ఈరోజు సొంత పార్టీ నేత, ఒకే జిల్లాకు చెందిన వ్యక్తి అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ఇంటి మీదకు వెళ్లి అంత హంగామా చేసినా మాట మాట్లాడట్లేదు. అదే పని జేసీ చేసి ఉంటే ఎంపీ రియాక్షన్ వేరే లెవల్లో ఉండేది. దివాకర్ రెడ్డి అరెస్టైనప్పుడు కూడ ఆయన ఆస్తులు అమ్మితే అనంతపురం జిల్లాను 20 ఏళ్లు పోషించవచ్చని, జేసీ అంత అవినీతిపరుడని వ్యాఖ్యలు చేసిన ఆయన ఈరోజు మాత్రం తమ ఎమ్మెల్యే చేసిన పనిని ఖండించలేకున్నారు. ఆరోజు జరిగిన ఘటన తాలూకు దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. సంధి కోసం వెళ్లానని అంటున్న కేతిరెడ్డి సంధికి కొడవళ్లు తీసుకెళ్లడం, దొరికిన వ్యక్తిని చితగొట్టడం ఎందుకో చెప్పలేదు. ఇక్కడ తప్పు ఎటువైపు ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆనాడు జేసీ దివాకర్ రెడ్డి బస్సుల విషయంలో చేసిన తప్పును ఘనంగా ఎత్తిచూపిన ఎంపీ మాధవ్ తన బాధ్యతగా ఈ విషయమై స్పందించి పొరపాటు జేసీ ప్రభాకర్ రెడ్డిదో, ఎమ్మెల్యేదో తేల్చి చెప్పవచ్చు కదా.