ఏపీ సీఎం వైఎస్ జగన్‌లో ఈ మార్పు వెనుక.?

నలుగురు ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు వేసిన పార్టీ, ‘ఎవర్నీ వదులుకోవడం నాకు ఇష్టం లేదు..’ అని ఎలా చెప్పగలుగుతోందబ్బా.? అసలు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వరం ఎందుకు మారింది.? గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి సమీక్ష సందర్భంగా వైసీపీ ప్రజా ప్రతినిథులకు, వచ్చే ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలకు సంబంధించి తాను బటన్ నొక్కాల్సి వుంటుందనీ.. అదే సమయంలో వైసీపీ ప్రజా ప్రతినిథులు.. ప్రజల్లో తిరుగుతూనే వుండాలనీ వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

‘నేను బటన్ నొక్కడం ఆపకూడదు.. మీరు తిరగడం ఆపకూడదు. అలాగైతేనే, 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలూ గెలిచేందుకు ఆస్కారం వుంటుంది..’ అని వైఎస్ జగన్, వైసీపీ ప్రజా ప్రతినిథుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు.? ప్యూన్ సరిపోతాడు కదా.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా పడే పొలిటికల్ సెటైర్లు మామూలేననుకోండి.. అది వేరే సంగతి.

ఇక, ‘ఎవర్నీ వదులుకోను. అందరూ నాక్కావాలి. బాధ్యతగా పని చేయండి..’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ప్రజా ప్రతినిథుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం, తమ వారసుల్ని ముందుకు తెస్తూ, ఈసారి మాకు టిక్కెట్ రాకపోవచ్చంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరోపక్క, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆ ఓటర్లు తమ సంక్షేమ పథకాల పరిధిలోకి రారని ముఖ్యమంత్రి స్వయానా చెప్పడం అధికార పార్టీ నేతల్నే విస్మయానికి గురిచేసింది.