అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు చూస్తున్న వారందరికీ మొత్తం బ్యాటింగ్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంశం ఏదైనా కానీండి చర్చలో ప్రతిపక్షం తరపున ఎవరు మాట్లాడాలన్నది చంద్రబాబునాయుడు ఇష్టం. అలాగే అధికారపార్టీ తరపున ఎవరు మాట్లాడాలో నిర్ణయించేది జగనే అన్న విషయం తెలిసిందే.
కానీ ఇక్కడే సమస్య వస్తోంది. ప్రతిపక్షం తరపున చంద్రబాబు తక్కువగాను అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, రామానాయుడు తదితరులు ఎక్కువగాను మాట్లాడుతున్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే తన నేతలతో మాట్లాడిస్తున్నారు. కానీ ఇదే వ్యూహం అధికారంపక్షం వైపు లోపించినట్లే అనిపిస్తోంది.
ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయా శాఖల తరపున మంత్రులు సమాధానం ఇస్తున్నారు. మరి ఇతర సందర్భాల్లో మొత్తం జగనే మాట్లాడేస్తున్నారు. టిడిపి సభ్యులు ఏ రూపంలో నోటీసిచ్చినా జగన్ ఒక్కళ్ళే సమాధానం ఇస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. వైసిపి తరపున ధాటిగా మాట్లాడగలిగిన మంత్రులున్నారు. రోజా, అంబటి రాంబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి ఎంఎల్ఏలు చాలామందున్నారు. మరి వాళ్ళతో ఎందుకు మాట్లాడించటంలేదో జగనే చెప్పాలి.
ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఎక్కువ భాగం జగనే మాట్లాడేవారు. దాంతో టిడిపి వాళ్ళు రెచ్చిపోయేవారు. ఇపుడు టిడిపి వాళ్ళు మాట్లాడుతుంటే జగన్ రెచ్చిపోతున్నారు. అలాకాకుండా మిగిలిన వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి సభలో జరుగుతున్నది చూస్తుంటే బాంగుంటుంది.