న్యాయవ్యవస్థ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందనేది వైఎస్ జగన్ లో బలంగా ఉన్న ఉద్దేశ్యం. మూడు రాజధానులు, ఇళ్ల పట్టాల పంపిణీ, డాక్టర్ సుధాకర్ కేసు, పాలనా పరమైన శాఖలను విశాఖకు తరలించడంపై స్టే, డాక్టర్ రమేష్ వివాదంలో ఆయన్ను విచారించకూడదనే ఉత్తర్వులు ఇలా పలు విషయాల్లో న్యాయస్థానం నుండి ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అనేక అంశాల్లో ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుబట్టింది. కొన్నింటిలో స్టేలు ఇస్తే ఇంకొన్ని విషయాల్లో మాత్రం నిర్ణయం మార్చుకోవాలని తేల్చి చెప్పేసింది. దీంతో జగన్ నేరుగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తూ చంద్రబాబు చెప్పినట్టు హైకోర్టు న్యాయమూర్తులు నడుచుకుంటున్నారని పిర్యాదు చేశారు. దీంతో కోర్టులకు, ప్రభుత్వానికి దూరం మరింత పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కొందరు కోర్టుల మీద, నయయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి మీద సీబీఐ విచారణకు ఆదేశిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ పరిణామాలన్నీ చూస్తే జగన్ కు, వైసీపీపైకోర్టుల విషయంలో అసహనం, అసంతృప్తి ఉండటం సహజమే అనిపిస్తాయి. కానీ ముందు నుండి చెప్పుకుంటున్నట్టు కోర్టులు జగన్ మీద కక్ష గట్టలేదని, అవి చంద్రబాబు చేతుల్లో లేవని తాజా పరిణామాలు కొన్ని రుజువు చేస్తున్నాయి. ఇటీవల జగన్ విషయంలో ప్రత్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లు కొన్నింటిని హైకోర్టు తోసిపుచ్చడం, కొట్టివేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే ముఖ్యమంత్రిని సమర్థిస్తూ మాట్లాడింది ధర్మాసనం.
ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను మీడియాకు బహిర్గతం చేసిన విషయంలో జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదని, ఆయన్ను పదవి నుండి తొలగించాలని అంటూ జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. మీడియాకు లేఖ విడుదలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరగా గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పిటిషనర్లను ప్రశ్నించారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడం ఏమిటని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
అలాగే కృష్ణాజిల్లా చందర్లపాడుకు చెందిన 20మంది మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ కింద అందాల్సిన ప్రయోజనాలు అందట్లేదని దాఖలైన పిటిషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులకు అందడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంటే జగన్ నిర్ణయాలను హైకోర్టు పొగిడిందన్నమాట. అలాగే పంచాయతీ కార్యాలయాలను రంగులకు అయినా 4 వేల కోట్లను మంత్రులు, అధికారుల నుండే వసూలు చేయాలని దాఖలైన పిటిషన్లో మంత్రులతో పాటు, ప్రభు త్వ కార్యదర్శులను వ్యక్తిగత ప్రతివాదులుగా ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించింది. పిటిషనర్ చెప్పే లెక్కలకు ప్రామాణికత ఏంటని, రంగుల ఖర్చుకు సంబంధించిన సరైన వివరాలతో మెరుగైన అఫిడవిట్ వేయాలని, ప్రభుత్వ కార్యదర్శులను వ్యక్తిగత ప్రతివాదులుగా పేర్కొనడంపై ఏజీ ఎస్.శ్రీరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవన్నీ ప్రభుత్వానికి అనుకూలమైన వ్యాఖ్యానాలే. వాటిలో కొన్నైతే ప్రభుత్వం తీరును సమర్థించేవిగా కూడ ఉన్నాయి. వీటికి బట్టి ప్రభుత్వం మీద హైకోర్టుకు ఎలాంటి చిన్నచూపు లేదని అర్థమవుతోంది. ఇది నిజంగా జగన్ కు ఆనందించదగిన అంశమే అనాలి. కానీ జగన్, ఆయన బృందం మాత్రం హర్షించట్లేదు. కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు, మొట్టికాయలు పడినప్పుడు బాధపడుతూ నేరుగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇప్పుడు అనుకూల వ్యాఖ్యానాలు వచ్చినప్పుడు ఎందుకు ఆనందించలేకపోతున్నారో, ఎందుకు బయటికి చెప్పుకోలేకపోతున్నారో వారికే తెలియాలి.