ఔను, ఎగబడ్డారు.! ప్రత్యక్షంగా వుంటే, కరిచేసేవాళ్ళేమో.! ఇలా జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా చర్చ.! అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రభావమెంత.? ఓ పది ఓట్లన్నా ఆయన వల్ల ఏదన్నా పార్టీకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో పడే పరిస్థితి ఏపీ రాజకీయాల్లో వుందా.?
ప్చ్.. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా పోయింది వైసీపీ నేతలకి. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ఒకరొకరుగా ఎగబడ్డారు రజనీకాంత్ మీద విమర్శలు చేయడానికి. మీడియా ప్రతినిథులే ఆశ్చర్యపోయారు.
ఇంతకీ, వైసీపీలో ఏం జరుగుతోంది.? ‘వై నాట్ 175’ అని ఓ వైపు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా నినదిస్తోంటే, ఇంకోపక్క అభద్రతాభావంతో వైసీపీ నేతలెందుకు విలవిల్లాడుతున్నారు.? ఇలా ఎవరు పార్టీలో డైరెక్షన్స్ చేస్తున్నారన్నది తేలాల్సి వుంది.
నిజానికి, వైసీపీ చాలా తేలిగ్గా తీసుకోవాల్సిన విషయమిది. హైద్రాబాద్‌ని రజనీకాంత్ న్యూయార్క్‌తో పోల్చినా, చంద్రబాబుతో తన సాన్నిహిత్యం గురించి ఆయన గొప్పగా చెప్పుకున్నా.. దాని వల్ల టీడీపీకి వచ్చే లాభమే ఏమీ వుండదు. అలాంటిది, వైసీపీకి వచ్చే నష్టం ఏముంటుంది.?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి నేతలకు తప్పుడు ఆదేశాలు వెళుతున్నాయా.? నేతలే అత్యుత్సాహం చూపుతున్నారా.? కారణం ఏదైనాగానీ, వైసీపీ జనంలో అభాసుపాలయిపోతోంది ఇలాంటి విషయాలతో.